Vijaya Sai Reddy: విజయసాయి రెడ్డి నిజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారా..?
విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP), రాజ్యసభ సభ్యత్వానికి (Rajyasabha MP) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇకపై తాను పూర్తిగా రాజకీయాలను (Politics) వదిలేస్తున్నానని, వ్యవసాయం (Agriculture) చేసుకుంటానని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పాలిటిక్స్ ను పూర్తిగా వదిలేసినట్లేనని అందరూ అనుకుంటున్నారు. వైసీపీలో (YCP) నెంబర్ టూగా ఉన్న నేత, ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండగానే ఎంపీ సీటును వదిలేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. పైగా పార్టీ ఓటమి తర్వాత జగన్ (YS Jagan) ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో రాజీనామా చేయడం అంటే కచ్చితంగా ఆయన విరక్తి చెందారని.. అందుకే పూర్తిగా దూరం కావాలని నిర్ణయించుకున్నారని భావిస్తున్నారు.
అయితే విజయసాయి రెడ్డి తాత్కాలికంగానే రాజకీయాలకు దూరమవుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కొంతకాలం తర్వాత ఆయన మళ్లీ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని వాళ్లు చెప్తున్న మాట. కూటమి (NDA) అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కీలక నేతలపై కేసులు చుట్టుముడుతున్నాయి. జగన్, విజయసాయి రెడ్డిపై మొదటి నుంచి కేసులున్నాయి. అవన్నీ ఇప్పుడు మళ్లీ కదిలాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ దగ్గరే ఉంటే వీటి నుంచి బయటపడడం అసాధ్యమని విజయసాయి రెడ్డికి అర్థమైంది. అందుకే వీలైనంత త్వరగా జగన్ నుంచి బయటపడాలని ఆయన కోరుకున్నారు. ఆ విధంగా బయటికొచ్చేశారు.
అయితే బయటకు వచ్చినంత మాత్రాన కేసుల నుంచి బయటపడే అవకాశం లేదు. అందుకే ఆయన బీజేపీతో (BJP) సన్నిహితంగా మెలిగేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన ఓ మీడియా సంస్థను ప్రారంభించబోతున్నారట. దాన్ని బీజేపీకి అనుకూలంగా నడిపేందుకు సిద్ధమవుతున్నారట.. అనంతరం కొంతకాలానికి ఆయన మళ్లీ బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట.. ఇవీ ప్రస్తుతం ఆయనపై నడుస్తున్న ఊహాగానాలు. ఆయన రాజీనామా వ్యవహారం అంతా బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే జరిగిందని.. మున్ముందు కూడా వాళ్ల సూచనల మేరకే విజయసాయి నడుచుకుంటారని తెలుస్తోంది.
బీజేపీ అంటే కూటమికోసం పనిచేస్తున్నట్టే. అందుకే ఆయన ఎక్స్ లో చంద్రబాబుతో వ్యక్తిగత వైరుద్ధం లేదని.. పవన్ కల్యాణ్ తనకు చిరకాల స్నేహితుడన విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. వాస్తవానికి కేవలం వైసీపీకి రాజీనామా చేసేటట్లయితే వీళ్ల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉండది. రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి వైదొలిగే క్షణం వరకూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను తీవ్రంగా విభేదించిన వ్యక్తి.. ఇప్పుడు ఒక్కసారిగా వాళ్లపై ప్రేమానురాగాలు చూపించడం అంటే తెరవెనుక ఏదో జరుగుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి విజయసాయి రెడ్డి రాజకీయ విరమణ తాత్కాలికమే కానీ శాశ్వతంగా ఉండకపోవచ్చని ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. మరి ఏం జరుగుతుందో చూద్దాం.













