టూరిజం జోన్ గా విశాఖ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ కేంద్రంగా అద్భుతమైన పర్యాటక జోన్ నిర్మాణం కాబోతుంది. పక్కా ప్రణాళికలతో రాజధాని అమరావతి తరహాలోనే విశాఖలో భీమిలి స్పెషల్ టూరిజం జోన్ (బీఎస్టీజెడ్) ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి పర్యాటక శాఖ సిద్ధం చేసిన ప్రణాళికలను ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. స్పెషల్ టూరిజం జోన్‌ను భీమిలి ప్రాంతంలో సముద్రం ఒడ్డున 425 ఎకరాల్లో ప్రత్యేక నగరంగా తీర్చిదిద్దనున్నారు. సీఆర్డీయే తరహాలో కమర్షియల్, రెసిడెన్సియల్, ఓపెన్ ప్లేస్ ఇలా వివిధ రకాల ప్రాంతాలుగా విభజించి దీనిని అభివృద్ధి చేస్తారు. 425 ఎకరాల్లో 32 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రెసిడెన్షియల్ ప్రాంతంగా, మరో 35 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రిసార్ట్స్ కోసం, మిగిలిన ప్రాంతాన్ని హోటల్స్, రెస్టారెంట్స్, గార్డెన్స్ పుడ్కోర్టులకు కేటాయించనున్నారు. నగరం రూపకల్పనకు ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌక ప్రధాన కారణం. రక్షణ శాఖ విరాట్‌ను ఏపీకి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వ దానిని విశాఖలోని సముద్ర తీరంలో ఉంచి మ్యూజియంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. విరాట్‌ను విశాఖ సముద్రం ఒడ్డున ఉంచి లోపల మ్యూజియంగా అభివృద్ధి చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచడం వల్ల ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ప్రత్యేక టూరిజం జోన్‌గా అభివృద్ధి చేయాలని భావిచింది. అందులో భాంగా బీఎస్టీజెడ్ నిర్మాణం కాబోతుంది.













