రూ. 50 సుదర్శనం టికెట్లు పూర్తి రద్దు
ఎన్నో ఏళ్లుగా సాధారణ భక్తులకు అందుబాటులో ఉన్న రూ.50 సుదర్శనం టికెట్లు రద్దయ్యాయి. విడతలవారీగా ఈ టికెట్ల కోటాను తగ్గిస్తూ వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 1 నుంచి పూర్తిస్థాయిలో రద్దు చేసింది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే మధ్యతరగతి భక్తులను దృష్టిలో పెట్టుకుని గత ఈవో రమణాచారి రూ.50 సుదర్శన దర్శనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ-దర్శన్ కౌంటర్ల ద్వారా టికెట్లను కేటాయించేవారు. దాదాపు 50 శాతానికిపైగా ఈ టికెట్లను పొందిన మధ్యతరగతి భక్తులు శ్రీవారిని శ్రీఘంగా దర్శించుకుంటున్నారు. అప్పట్లో వైకుంఠ క్యూకాంప్లెక్స్‌లో ఈ భక్తులకు మాత్రమే 8 కంపార్టుమెంట్లను కేటాయించారు. ఆ తర్వాత ఈవోగా వచ్చిన ఐవైఆర్ కృష్ణారావు రూ.300 శ్రీఘ్రదర్శనం విధానాన్ని అమలు చేశారు. దీంతో రూ.50 సుదర్శనం టికెట్ల కేటాయింపులో కోత విధించారు. ఆ తర్వాత ఈవోగా పనిచేసిన ఎంజీ గోపాల్ రూ.300 ఆన్లైన్ ప్రత్యేక దర్శన విధానాన్ని శ్రీకారం చుట్టారు. క్యూలైన్ లో నిరీక్షణ లేకుండా ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకున్న సమయాల్లో శ్రీవారిని దర్శించుకునే చర్యలు తీసుకోవడంతో పాటు కోటాను భారీగా పెంచారు. ఈ తరుణంలో రూ.50 సుదర్శన టికెట్ల కేటాయింపు తగ్గుతూ వచ్చింది. ఆన్లైన్ దర్శన విధానానికి మంచి స్పందన లభిస్తుండటంతో సుదర్శన టికెట్లను సోమ, మంగళ, బుధవారాల్లో (వారానికి 3 రోజులు) మాత్రమే మంజూరు చేయడం ప్రారంభించారు. ఈ నెల 1 నుంచి రూ.50 సుదర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేశారు. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం. రూ.50 సుదర్శనం టికెట్ల రద్దుతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






