TDP: రాజ్యసభ టీడీపీకే.. అభ్యర్ధి ఎవరంటే…
ఆంధ్రప్రదేశ్ లో ఓ రాజ్యసభ (Rajya Sabha) స్థానం గురించి ఇప్పుడు కనపడకుండా చర్చ జరుగుతుంది. కూటమిలోని మూడు పార్టీలు ఈ రాజ్యసభ సీటు విషయంలో కాస్త పట్టుదలగానే ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఇటీవల మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. అందులో ఒక స్థానాన్ని బిజెపికి మరో రెండు స్థానాలను టిడిపికి ఇచ్చారు. ఇక ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది క్లారిటీ రావటం లేదు.
అయితే రాజ్యసభ స్థానాన్ని మళ్లీ టిడిపి (TDP) కే కేటాయించే అవకాశాలు కనబడుతున్నాయి. టిడిపి నుంచి ఒక కీలక నేత రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి ఇంకా మూడు ఏళ్లకు పైగా సమయం ఉంది. ఇందుకోసం గల్లా జయదేవ్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను పార్లమెంటుకు పంపాలని చంద్రబాబు నాయుడు రెండుసార్లు భావించారు.
2024 ఎన్నికలకు ముందు రాజకీయాలనుంచి తప్పుకున్న గల్లా జయదేవ్.. పార్టీకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. ఈసారి ఆయనను ఎలాగైనా సరే పార్లమెంట్ కు పంపితే తనకు ప్రయోజనంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బిజెపి అధిష్టానం గల్లా జయదేవ్ విషయంలో కాస్త అసహనంగా ఉన్నా ఏదో ఒక రకంగా సెట్ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ఇక గల్లా జయదేవ్ కూడా సానుకూలంగా ఉండటంతో.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆర్థికంగా కూడా బలమైన నేత కావడం.. సబ్జెక్టు ఉన్న నాయకుడు కావడంతో పార్లమెంట్లో ఉంటే కచ్చితంగా ప్రయోజనం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలను కూడా వినూత్నంగా నిర్వహించడంలో గల్లా జయదేవ్ కాస్త పట్టుదలగానే ఉంటారు. పారిశ్రామిక రంగంలో ఆయనకున్న పరిచయాలు కూడా ప్రభుత్వానికి ఉపయోగపడే అవకాశాలున్నాయి.













