Swachh Bharat: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్: పరిశుభ్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని (Andhra Pradesh) పరిశుభ్రమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ, దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రతినెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ (Swachh Andhra_Swach Diwas) కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గురువారం ప్రకటించారు.
ఈ నెల 18న కడప జిల్లా మైదుకూరులో (Mydukur) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandra Babu Naidu) ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడానికి కలెక్టర్లు తగిన శ్రద్ధ చూపాలని సూచించారు.
ప్రతి నెలా ఒక ప్రత్యేకమైన థీమ్ తో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదాహరణకు, జనవరిలో ‘న్యూ ఇయర్ – క్లీన్ స్టార్’ థీమ్, ఫిబ్రవరిలో ‘సోర్సు-రిసోర్సు,’ మార్చిలో ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ – రీయూజబుల్స్ ప్రోత్సాహం’ వంటి థీమ్లు అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు కీలకంగా వ్యవహరించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహించేందుకు పురపాలక శాఖ మంత్రి నారాయణ సూచనలు చేశారు. కలెక్టర్లు తమ జిల్లాల్లో కార్యక్రమం విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత పెంపొందించడానికి, స్వచ్ఛ భారత్ యోజనను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పారు.
విజయవాడలో జనవరి 26న జరగనున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రజలకు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు 14 శాఖల శకటాల ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ ఉద్యమం రాష్ట్రంలో కూడా విజయవంతంగా అమలవుతోందని, ఈ దిశగా ప్రభుత్వ చర్యలు మరింత బలోపేతం అవుతాయని అధికారులు తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం రాష్ట్రం పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు.







