వేడిక్కిన ఆంధ్రప్రదేశ్ రాజకీయం
* అభ్యర్థుల ఎంపికలో పార్టీలు తలమునకలు
* పార్టీలకు మొదలైన అసంతృప్తుల బెడద
* వైసీపీలో పలువురు సిట్టింగులకు స్థానచలనం
* సీట్ల లెక్క తేల్చని టీడీపీ – జనసేన కూటమి
* అసంతృప్తులు, ఆశావహుల చూపంతా జనసేన వైపే!
* దిక్కుతోచని స్థితిలో బీజేపీ
* కాంగ్రెస్కు ఊపు తెచ్చిన షర్మిల
ఆంధ్రప్రదేశ్ అంటేనే రాజకీయం. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరెక్కడా లేని విధంగా ఇక్కడ కులాలు రాజకీయాలను శాసిస్తాయి. బహుశా అందుకేనేమో అంత ఆసక్తి. ఇక ఎన్నికల సీజన్ వస్తోందంటే ఏ నలుగురు గుమికూడినా అక్కడ రాజకీయాలు తప్ప మరోమాట ఉండదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే నడుస్తోంది. మరో మూడు నెలల్లో అటు లోక్ సభకు, ఇటు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో పార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార వైసీపీ ఈసారి 175 సీట్లూ గెలిచి మళ్లీ పగ్గాలు చేపట్టాలని పట్టుదలగా ఉంది. అయితే ఎక్కడో ఏదో భయం ఆ పార్టీని వెంటాడుతోంది. గత ఎన్నికల్లో లాగా ఈసారి అంత ఈజీ కాదనే టాక్ ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తోంది. ఇక ప్రతిపక్ష టీడీపీకి ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి. ఈసారి గెలిస్తేనే వైసీపీని ఎదుర్కోగలుగుతుంది. లేకుంటే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందనే భయం తెలుగుదేశాన్ని వెంటాడుతోంది. జనసేన గతంతో పోల్చితే బలపడింది. టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతామని ఇప్పటికే ప్రకటించడంతో పార్టీలో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ ఆశలపందిరిలో విహరిస్తున్నాయి. ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఈ రెండూ ఖాతా తెరిచే పరిస్థితి లేదు. అయితే షెడ్యూల్ విడుదలైన తర్వాతే అసలు రాజకీయం మొదలవనుంది.
వైసీపీ ప్రయోగాలు ఫలిస్తాయా..?
ప్రస్తుతం అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. గత ఎన్నికల్లో ఆ పార్టీకి 151 స్థానాలు దక్కాయి. ఈసారి 175 స్థానాల్లోనూ గెలవాలనేది వైసీపీ టార్గెట్. అందుకు అనుగుణంగా ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అందులో మొదటిది అభ్యర్థుల మార్పు. తెలంగాణ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులకు పెద్దపీట వేసి బోల్తా కొట్టింది. దీంతో అలర్ట్ అయిన జగన్ సిట్టింగుల్లో చాలా మందికి సీట్లు నిరాకరిస్తున్నారు. కొంతమంది సిట్టింగులను మరో నియోజకవర్గానికి మారుస్తున్నారు. ప్రతిరోజూ కొన్ని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహిస్తూ మార్పులు, చేర్పులు చేరుస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నేతలను, ప్రాంతీయ సమన్వయకర్తలను క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత జాబితా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు జాబితాలు రిలీజ్ అయ్యాయి. అభ్యర్థులు అని కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ల పేరిట ఈ లిస్టులు విడుదల చేస్తున్నారు. చివరి నిమిషంలో ఏదైనా ఇబ్బందులు ఎదురైతే తప్పా అభ్యర్థులుగా వీళ్లే ఉండనున్నారు. దీంతో ఈ జాబితాలో చోటుకోసం నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నియోజకవర్గ ఇన్ఛార్జ్ ల ఎంపిక విషయంలో జగన్ కొత్త పంథా అవలంభిస్తున్నారు. చివరి నిమిషం వరకూ నాన్చకుండా మూడు నెలల ముందే అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సి వస్తే వారిని పిలిచి నేరుగా చెప్పేస్తున్నారు. సర్వేల్లో గెలవడం కష్టంగా ఉందని తేలిందని.. అందుకే సీటు ఇవ్వలేకపోతున్నానని స్పష్టం చేస్తున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థికి సహకరించాలని కోరుతున్నారు. దీంతో కొంతమంది నేతలు సరేనంటున్నారు. మరికొంతమంది ససేమిరా అంటున్నారు. సీటు ఇవ్వకపోతే సహకరించేది లేదని కరాఖండిగా చెప్పేస్తున్నారు. అయినా జగన్ డోంట్ కేర్ అంటున్నారు. తొలిజాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియమించారు జగన్.
సర్వేలు, సామాజిక సమీకరణాల పేరుతో వైసీపీ విడుదల చేస్తున్న జాబితాలపై పలుచోట్ల అసంతృప్తులు పెల్లుబికాయి. పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేశారు. జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరొందిన వాళ్లే పార్టీని వీడుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సామాజిక సమీకరణాల్లో భాగంగా సీట్లు నిరాకరించడంతో ఆళ్ల రామకృష్ణా రెడ్డి, కొలుసు పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి ఇప్పటికే పార్టీకి దండం పెట్టేశారు. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా రాజీనామా చేశారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా టైమ్ కోసం వేచి చూస్తున్నట్టు సమాచారం. ఈ జాబితాలన్నీ పూర్తయి ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చేసరికి మరికొంతమంది నేతలు పార్టీ నుంచి బయటకు రావడం ఖాయంగా ఉంది. అలాగే ఇతర పార్టీల్లోని అసంతృప్తులు కూడా వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని. ఇదే కోవలో మరికొంతమంది నేతలు అధికారపక్షంలో చేరే అవకాశం కనిపిస్తోంది.
అధికారంలో ఉండడం వైసీపీ బలం. సంస్థాగతంగా మంచి పట్టు సాధించింది. తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తప్పకుండా తమను అధికారంలోకి తీసుకొస్తాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. ఇతర పార్టీలతో పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్తుండడంతో సీట్ల కొట్లాట లేదు. అయితే సిట్టింగులకు సీట్లు నిరాకరించడం పలుచోట్ల ఇబ్బందులకు కారణమవుతోంది. అయినా ఏమాత్రం వెనుకంజ వేయని జగన్ త్వరలో క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. శ్రీకాకుళం మొదలు కుప్పం వరకూ ప్రతిరోజూ బహిరంగసభల ద్వారా జనాలకు చేరువయ్యేందుకు ప్లాన్ వేశారు. మరోవైపు ఎప్పటికప్పుడు ఐప్యాక్ టీమ్ వైసీపీకి అవసరమైన పనులు చక్కబెడుతోంది.
ఆశలపల్లకిలో తెలుగుదేశం
2019లో వైసీపీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ డీలా పడింది. కింది స్థాయి కార్యకర్తలు మొదలు పార్టీ అధినేత వరకూ అందరూ కేసుల్లో ఇరుక్కున్నారు. మానసికంగా కూడా పార్టీ బలహీనపడింది. ఈ నిరుత్సాహాన్ని పారదోలాలంటే ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన అవసరం టీడీపీకి ఉంది. అందుకే గతానికి భిన్నంగా టీడీపీ పనిచేస్తోంది. వైసీపీని గద్దె దించేందుకు తమ ముందున్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు జనసేనతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయడం వల్ల నష్టపోయామని టీడీపీ నమ్ముతోంది. అందుకే ఈసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని గట్టిగా భావిస్తోంది.
గతంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే ఫైనల్. అయితే ఇప్పుడు టీడీపీ కూడా షో టైమ్ కన్సల్టెన్సీ అనే పొలిటికల్ క్యాంపెయినింగ్ సంస్థను ఏర్పాటు చేసుకుంది. రాబిన్ శర్మ నేతృత్వంలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఈ సంస్థ పనిచేస్తోంది. రాబిన్ శర్మ నివేదికల మేరకు చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఆరు పథకాలను ముందుగానే ప్రకటించింది టీడీపీ. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా లబ్ది పొందాలనుకుంటోంది. కర్నాటక, తెలంగాణల్లో సూపర్ సక్సెస్ అయిన మహిళలకు ఉచిత రవాణా, పెన్షన్ల పెంపు లాంటి స్కీములను అమలు చేస్తామని చెప్పింది. ఈ పథకాలు జనాల్లోకి బాగానే వెళ్లాయని టీడీపీ కేడర్ నమ్ముతోంది. తమ మేనిఫెస్టో చూసిన తర్వాత జగన్ భయపడిపోయి కొన్ని పథకాలను ముందుగానే అమలు చేసేందుకు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో మేనిఫెస్టోను చివరి నిమిషం వరకూ వెల్లడించేవారు కాదు. కానీ ఈ దఫా దాదాపు ఏడాది ముందుగానే మినీ మేనిఫెస్టోను ప్రకటించేసింది టీడీపీ. టీడీపీ ప్రకటించిన పథకాలకు జనాల్లో వస్తున్న స్పందనపై ఆ పార్టీ సంతృప్తిగా ఉంది.
ప్రజల దగ్గరకు వెళ్లడంలో వైసీపీతో పోల్చితే తెలుగుదేశం పార్టీ ముందుందని చెప్పొచ్చు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఓ దఫా జిల్లాలను చుట్టేశారు. తాజాగా రా కదలిరా పేరుతో మరోసారి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. రోజుకు రెండు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇక యువగళం పాదయాత్రను ముగించుకున్న నారా లోకేశ్ కేడర్ ను యాక్టివేట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇటీవల వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను చంద్రబాబుకు దగ్గరకు తీసుకురావడంలో లోకేశ్ కీలకంగా పనిచేశారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన ప్రశాంత్ కిశోర్ తెరవెనుక టీడీపీకి పని చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ నేతలు కూడా ప్రశాంత్ కిశోర్ ను విమర్శించడంతో ఇది రుజువైంది. ఓడిపోయే పార్టీకి ప్రశాంత్ కిశోర్ పనిచేయరనే టాక్ ఉంది. వైసీపీ ఓడిపోతుంది కాబట్టే ప్రశాంత్ కిశోర్ టీడీపీ చెంత చేరారనే ప్రజారం జరుగుతోంది. ఇవన్నీ టీడీపీకి కలిసొచ్చే అంశాలు.
మరోవైపు జనసేనతో కలిసి వెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. రెండు పార్టీల అధినేతలు ఈ విషయంలో సమన్వయంగా ముందుకు వెళ్తుండడం రెండు పార్టీలకు సానుకూల అంశం. అయితే అధినేతలు సఖ్యతగా ఉంటే సరిపోదు. కిందిస్థాయిలో రెండు పార్టీల కేడర్ కలిసిపోయి పని చేసినప్పుడే సత్ఫలితాలు ఉంటాయి. ఇదే ఇప్పుడు ఆ రెండు పార్టీలకు ఉన్న పెద్ద సమస్య. ఇప్పటికీ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదు. సీట్లు ఖరారైతే అసంతృప్తులు, అలకలు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాటిని చక్కదిద్దుకున్నప్పుడే రెండు పార్టీలకు మేలు జరుగుతుంది.
ఆశావహుల చూపు.. జనసేన వైపు..!!
గత ఎన్నికలతో పోల్చితే జనసేన పార్టీ పుంజుకుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పెద్దగా జనాల్లోకి వెళ్లట్లేదనే అపవాదు ఉన్నా కేడర్ మాత్రం ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. ఒంటరిగా కాకుండా టీడీపీతో కలిసి వెళ్తేనే పార్టీకి ప్రయోజనం ఉంటుందని కేడర్ బలంగా కోరుకుంటోంది. ఆ దిశగా రెండు పార్టీలు ఒక అంగీకారానికి రావడంతో ఈసారి తాము గణనీయమైన స్థాయిలో సీట్లు సాధించుకోవడం ఖాయమని జనసైనికులు నమ్ముతున్నారు. టీడీపీతో పొత్తు ఉండడంతో జనసేనలో చేరితే సీటు ఖాయమని పలువురు నేతలు కూడా భావిస్తున్నారు. అందుకే వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్.. తదితర పార్టీల్లో సీట్లు దక్కని నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఇటీవల జనసేనలో చేరడం ఆ పార్టీకి మంచి ఊపు తెచ్చింది. వైసీపీలో చేరి వారం రోజులకే రాజీనామా చేసిన క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం లాంటి నేతలు కూడా జనసేన వైపు చూస్తుండడం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అది వర్కవుట్ కాలేదు. విషయం తెలుసుకున్న జనసేన – టీడీపీ నేతలు ముద్రగడను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఆయన అంగీకరించడంతో రెండు పార్టీలు హ్యాపీగా ఉన్నాయి. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పవన చెంత చేరేందుకు సుముఖంగా ఉన్నారు. టికెట్లు దక్కని వైసీపీ, బీజేపీ నేతలు చాలా మంది జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ – జనసేన కలిసి పనిచేస్తుండడం రెండు పార్టీలకూ మంచిదే. అయితే క్షేత్రస్థాయిలో కొంతమంది కార్యకర్తలు టీడీపీతో కలిసి వెళ్లడాన్ని అంగీకరించడం లేదు. వీరిని పార్టీ అధినాయకత్వం దారిలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్న చోట జనసేన, జనసేన బరిలో ఉన్నచోట టీడీపీ.. కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ఓట్ల బదలాయింపు జరిగితే ఓకే.. లేకుంటే రెండు పార్టీలకు నష్టం జరగడం ఖాయం. ఈ విషయంలో రెండు పార్టీలూ పూర్తిస్థాయిలో సమన్వయం చేసుకోగలిగితే ప్రయోజనం ఉంటుంది. ఈ రెండు పార్టీలకూ ఇదే ఇప్పుడు అతి పెద్ద సమస్య.
మరోవైపు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండడంతో ఈసారి మేనిఫెస్టో కూడా ఉమ్మడిగానే ప్రకటించాలని నిర్ణయించాయి. రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ఇందులో కనిపించబోతోంది. ఇప్పటికైతే రెండు పార్టీలూ సమన్వయంతోనే ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేస్తానని.. ఆ పార్టీని ఓడించడమే తన ఏకైక ధ్యేయమని పవన్ కల్యాణ్ పదే పదే చెప్తున్నారు. టీడీపీతో ఎందుకు కలసి వెళ్తున్నామో కూడా కార్యకర్తలకు వివరిస్తున్నారు. టీడీపీతో కలిసి పనిచేయడం ఇష్టంలేని కార్యకర్తలు ఎవరైనా ఉంటే ఇప్పుడే వెళ్లిపోవాలంటూ పవన్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే ఏకైక ఆప్షన్ అని కుండబద్దలు కొట్టారు. దీంతో కేడర్ కు ఒక క్లారిటీ వచ్చింది.
టీడీపీ – జనసేన ముందున్న అతి పెద్ద సమస్య సీట్ల పంపకం. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఈ రెండు పార్టీలు అభ్యర్థులను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉండనుంది. సీట్లు దక్కుతాయని టీడీపీ, జనసేనల్లో చేరుతున్న పలువురు నేతలకు చివర్లో సీట్లు రాకపోతే అలకపూనే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటన్నింటినీ తట్టుకోవాల్సిన అవసరం రెండు పార్టీలకూ ఉంది.
క్రాస్ రోడ్స్ లో కమలం!
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి అంతుచిక్కడం లేదు. జనసేనతో తాము కలిసి పనిచేస్తున్నామని బీజేపీ చెప్తోంది. కానీ జనసేన మాత్రం టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోంది. బీజేపీవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో బీజేపీ నేతలు అయోమయంలో పడిపోతున్నారు. వాస్తవానికి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. ఏపీలో పొత్తు పెట్టుకున్న సందర్భాల్లో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం దక్కింది. కాబట్టి ఈసారి కూడా ఏదైనా పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వైసీపీ తమతో సఖ్యతగా ఉన్నా కలిసి వెళ్లే ఛాన్సే లేదు. పొత్తులకు వైసీపీ వ్యతిరేకం. దీంతో వాళ్ల ముందున్న ఏకైక ఆప్షన్ టీడీపీ – జనసేన కూటమి. జనసేనతో కలిసి పని చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కానీ టీడీపీతో కలిసి వెళ్లేందుకు ఆసక్తిగా లేదు. అదే సమయంలో నిన్నమొన్నటివరకూ బీజేపీతో కలిసి వెళ్లేందుకు ఉవ్విళ్లూరిన టీడీపీ కూడా ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లకపోవడమే బెటర్ అనే ఆలోచనలో ఉంది. అవసరమైతే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పనిచేయడంపై ఆలోచిద్దామని భావిస్తోంది. దీంతో బీజేపీకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి.
ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి ఉంటే బీజేపీ నుంచి బయటకు వచ్చేందుకు చాలా మంది నేతలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ టీడీపీ గూటికి చేరి సత్తెనపల్లి టికెట్ తెచ్చుకున్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో బీజేపీ నేతలు కాస్త నైరాశ్యంలో ఉన్నారు. మరి ఎన్నికల నాటికి ఎంతమంది పార్టీలో మిగులుతారో చూడాలి.
కాంగ్రెస్ ఆశలన్నీ షర్మిల పైనే..!!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీలో కూడా కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాక వై.ఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం సమీకరణాలను సమూలంగా మార్చేయబోతోంది. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించి పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు వై.ఎస్.జగన్. జగన్ జైలుకు వెళ్లినప్పుడు ఆ పార్టీని భజస్కంధాలపై వేసుకుని సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల. కానీ ఇప్పుడు జగన్ కు, షర్మిలకు చాలా గ్యాప్ వచ్చేసింది. దీంతో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. షర్మిల ఏపీలో మొదలుపెట్టి తెలంగాణ మీదుగా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ ఏపీకి వచ్చి వాలారు. దీంతో అన్నా చెల్లెళ్ల మధ్య వార్ జరగబోతోంది.
ఒకవైపు షర్మిల, మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావడంతో ఏపీలో కూడా కాంగ్రెస్ నేతలకు కాస్త ఆశల మోసులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం యాక్టివ్ గా లేని నేతలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వస్తున్నారు. రఘువీరా రెడ్డి లాంటి నేతలు మళ్లీ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు.. వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే తాను షర్మిల వెంట నడుస్తానని చెప్పారు అలాగే కాపు రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాగే మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. నేతల వెంట కేడర్ మొత్తం కలిసొస్తుందని చెప్పలేం. కాబట్టి కేడర్ తోడైతేనే ఏ పార్టీకైనా బలం. కానీ అదే కాంగ్రెస్ పార్టీకి లోపించింది. మరి షర్మిల ఈ పార్టీని ఏ మేరకు గట్టెక్కిస్తారో వేచి చూడాలి.
– సి.ఎల్.ఎన్.రాజు













