PVS – RSP: ప్రతి దాంట్లోనూ కుల రాజకీయమేనా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారూ..!?
ఆంధ్రప్రదేశ్ లో మాజీ సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి పి.వి.సునీల్ కుమార్ (PV Sunil Kumar) పైన ప్రభుత్వం సస్పెన్షన్ (Suspension) వేటు వేసింది. నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ అనుమతి లేకుండా పలుమార్లు విదేశాలకు (foreign trips) వెళ్లారనే కారణంతో ఆయనపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవో కూడా విడుదల చేసింది. అయితే ఆయన సస్పెన్షన్ ను నిరసిస్తూ పలువురు స్పందిస్తున్నారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఘాటుగా ఓ ట్వీట్ వేశారు. ఇందులో ఆయన కులం కార్డును వాడుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒక ఉన్నత స్థానంలో పని చేసిన ఓ అధికారి ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపోతున్నారు.
సునీల్ కుమార్ ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందో సవివరంగా జీఓ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే వాటన్నటినీ పట్టించుకోని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్.. కేవలం దళితుడు (Dalit) కావడం వల్లే ఆయనపై సస్పెన్షన్ విధించారని ఆరోపించారు. ఇంతకు మించిన పనికిమాలిన ఆరోపణ మరొకటి ఉండదు. దళితులు విమానాలు ఎక్కకూడదా.. విదేశాలకు పోకూడదా.. అని ప్రశ్నించారు. విదేశాలకు దళితులు వెళ్లొద్దని ఎవరైనా చెప్పారా..? ఎంతమంది దళితులు విదేశాలకు వెళ్లట్లేదు..? దీనికి మాత్రం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ దగ్గర సమాధానం లేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నప్పుడు కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి కట్టుబడి ఉండాలి. ఆ విషయాన్ని ఓ ఉన్నత స్థానంలో పనిచేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గుర్తించకపోవడం విశేషం.
మీరు మాత్రం ప్రభుత్వ నిధులతో విదేశాలకు వెళ్లొచ్చా.. సునీల్ కుమార్ సొంత డబ్బులతో వెళ్తే తప్పేంటి అనేది ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మరో ప్రశ్న. ఇక్కడ మీరు అంటే చంద్రబాబు (Chandrababu).., లోకేశ్ (Lokesh).. వీళ్లిద్దరూ దావోస్ పర్యటనకు వెళ్లడాన్ని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తప్పుబట్టారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ కూడా దావోస్ వెళ్లారు. మరి కేటీఆర్ (KTR) సొంత నిధులతో వెళ్లారా.. ప్రభుత్వ డబ్బుతో వెళ్లారా..? దీనికి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సమాధానం చెప్పగలరా..? సునీల్ కుమార్ సొంత డబ్బుతో ఎక్కడికి వెళ్లారు..? కుమారుడి దగ్గరికైతే ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? జార్జియా వెళ్తున్నా అని యూఏఈకి ఎందుకెళ్లారు..? మీరైనా సమాధానం చెప్పగలరా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ గారూ?
దళితులను చంద్రబాబు అణగదొక్కుతున్నారని, వాళ్లపై చంద్రబాబుకు సదభిప్రాయం లేదనేది ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మరో ఆరోపణ. ఏవో విమర్శలు చేయాలి కాబట్టి చేసినట్లుంది ఆర్.ఎస్.పి. తీరు. బాలయోగి లాంటి దళితుడిని లోక్ సభ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన ఘనత టీడీపీది. ఎంతోమంది దళిత ఉన్నతాధికారులు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. సునీల్ కుమార్ కూడా చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. నిజంగా దళితులపై చంద్రబాబుకు సదభిప్రాయం లేకపోతే అప్పుడే సునీల్ కుమార్ పైన వేటు వేసేవారు కదా..? ఇప్పుడే ఎందుకు చర్యలు తీసుకున్నారు..? అసలు సునీల్ కుమార్ పైన వేటు ఎందుకు పడిందో తెలుస్కోకుండా.. కేవలం కులం కార్డును ఉపయోగించి లబ్ది పొందాలనుకోవడం, బురద జల్లాలనుకోవడం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తికి తగదు.













