Rajyasabha Seats: కూటమిలో ‘రాజ్యసభ సీట్ల’ సెగ..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ‘రాజ్యసభ సీట్ల’ చుట్టూ తిరుగుతున్నాయి. వచ్చే జూన్ నెలలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల కోసం అధికార కూటమిలో ఇప్పటి నుంచే సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శాసనసభలో కూటమికి ఉన్న తిరుగులేని బలంతో ఈ నాలుగు స్థానాలు ఏకగ్రీవం కావడం ఖాయమని తేలిపోవడంతో, ఆ సీట్లను దక్కించుకునేందుకు ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.
ప్రస్తుత అంచనాల ప్రకారం, మొత్తం 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ రెండు, బీజేపీ ఒకటి, జనసేన ఒక స్థానాన్ని పంచుకునే అవకాశం కనిపిస్తోంది. తమకు ఖచ్చితంగా ఒక స్థానం కేటాయించాలని పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించినందున, తమ పార్టీకి పెద్దల సభలో ప్రాతినిధ్యం ఉండాలని జనసేన గట్టిగా కోరుతోంది.
జనసేన కోటాలో సీటు దక్కితే, ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీకి ఆయన అందిస్తున్న సహకారం, పవన్ కల్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్లస్ కానున్నాయి. టీడీపీతో సత్సంబంధాలు రమేశ్ కు కలిసొచ్చే అంశం.
ఇక టీడీపీకి దక్కే రెండు స్థానాల కోసం పార్టీ సీనియర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వర రావు, పార్టీ విధేయుడు కంభంపాటి రామ్మోహన్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత సభ్యుడు సానా సతీశ్ తన పదవిని రెన్యూవల్ చేసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీ అవసరాల దృష్ట్యా చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
బీజేపీకి దక్కే ఒక స్థానం విషయంలో అత్యంత ఆశ్చర్యకరమైన చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన విజయసాయి రెడ్డి, అనూహ్యంగా బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనే వార్తలు రాజకీయ వర్గాలను షేక్ చేస్తున్నాయి. ఆయన ఇప్పటికే ఎంపీ పదవికి రాజీనామా చేయడం, బీజేపీ పెద్దలతో టచ్‌లోకి వెళ్లడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. ఇటీవలే తాను జూన్ నుంచి రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించడంతో రాజ్యసభ సీటు ఊహాగానాలు నిజమేనేమో అనిపిస్తోంది. అయితే, బీజేపీ అధిష్టానం స్థానిక నేతలకు ఇస్తుందా లేక బయటి వ్యక్తులను ప్రోత్సహిస్తుందా అనేది సస్పెన్స్‌గా మారింది.
కూటమిలోని మూడు పార్టీల మధ్య ఎక్కడా అసంతృప్తి రాకుండా, సమన్యాయం ప్రాతిపదికన సీట్ల పంపకం ఉండాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. జూన్ నాటికి ఈ సమీకరణాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఈసారి ఏపీ రాజ్యసభ ఎన్నికలు కేవలం అభ్యర్థుల ఎంపిక మాత్రమే కాదు.. కూటమి పార్టీల మధ్య సమన్వయానికి, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి.













