Galla: గల్లా వారికే రాజ్యసభ..?
ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డి( Vijayasai Reddy) రాజీనామాతో ఖాళీ అయిన సదరు రాజ్యసభ స్థానానికి.. టిడిపి నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో, కూటమి పార్టీలలో ఏ పార్టీ.. రాజ్యసభ తీసుకుంటుంది అనే దానిపై స్పష్టత రావటం లేదు. అయితే దాదాపుగా ఆ స్థానం నుంచి టిడిపి పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) పేరు ప్రముఖంగా వినపడుతోంది. గతంలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సందర్భంగా.. కూడా ఆయన పేరు వినపడింది. అయితే ఈసారి మాత్రం గల్లా జయదేవ్ కచ్చితంగా రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పారిశ్రామికవేత్త కావడం, దానికి తోడు విషయం ఉన్న నాయకుడు కావడంతో ఆయన రాజ్యసభలో ఉంటే.. తనకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
త్వరలోనే గల్లా జయదేవ్ పేరును ప్రకటించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక రాజ్యసభ స్థానానికి జనసేన పేరు కూడా వినపడినా.. నాగబాబును రాజ్యసభకు కాకుండా శాసనమండలికి ఎంపిక చేయడంతో రేసు నుంచి జనసేన తప్పుకున్నట్లుగానే కనబడుతోంది. ఇక బిజెపికి కూడా ఒక స్థానాన్ని కేటాయించారు. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ నుంచి మరోసారి ఎన్నికయ్యారు. గల్లా జయదేవ్ విషయంలో జనసేన కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు ఎంపీగా ఉన్న సమయంలో ఆయన పార్లమెంట్ సమావేశాల్లో దుమ్మురేపేవారు. ఆయన ప్రసంగాలకు సోషల్ మీడియాలో సైతం ఆదరణ ఎక్కువగా ఉండేది. టిడిపి క్యాడర్ కూడా ఆయన విషయంలో సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిగా మారింది.













