R.Krishnaiah : అదృష్టవంతుడు ఆర్. కృష్ణయ్య..! బీజేపీ నుంచి రాజ్యసభకు..!!
బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Society) అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah). దశాబ్దాలుగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. బీసీల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆయన మొదలుపెట్టిన ఆ ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ ఉద్యమం మాటున బీసీలకు ఎంతమేర ప్రయోజనం కలిగిందో తెలీదు కానీ ఆర్.కృష్ణయ్య మాత్రం బాగానే పదవులు చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు మరోసారి ఎంపీగా అధికారాన్ని దక్కించుకున్నారాయన. అందుకే ఆర్.కృష్ణయ్య అంతటి అదృష్టవంతుడు బీసీల్లో మరెవరూ ఉండకపోవచ్చనే టాక్ నడుస్తోంది.
ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. బీసీలకు రాజ్యాధికారంతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్లు, వాళ్ల అభ్యున్నతికోసం పాటుపడే సంస్థ అది. గతంలో ఈ సంస్థ బీసీలకోసం పలుమార్లు ఉద్యమాలు చేపట్టింది. అయితే ఇటీవలికాలంలో అలాంటి ఉద్యమాలు కనిపించిన దాఖలాలు లేవు. అయినా ఆర్.కృష్ణయ్య మాత్రం అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆ విషయాన్ని పక్కన పెడితే తెలుగురాష్ట్రాల్లో బీసీలే న్యాయనిర్ణయేతలు. దాదాపు 50శాతం జనాభా ఉన్న బీసీలకోసం రాజకీయ పార్టీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి. ఆ క్రమంలో బీసీల నాయకులకు ఎన్నో పదవులు ఆఫర్ చేస్తుంటాయి.
ఆర్.కృష్ణయ్య కూడా అలా ఎన్నో పదవులను దక్కించుకున్నారు. మొదట టీడీపీ (TDP) ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది. అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆర్.కృష్ణయ్య తెలంగాణకు పరిమితమైపోయారు. రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా లేరు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఏరికోరి ఆర్.కృష్ణయ్యను తీసుకొచ్చి ఏపీ నుంచి రాజ్యసభకు పంపించింది. ఇది ఎవ్వరూ ఊహించలేదు. ఆర్.కృష్ణయ్య తెలంగాణ (Telangana) వ్యక్తి. అయినా ఆయన్ను ఏపీ నుంచి ఎంపీని చేసింది వైసీపీ. అయితే ఇటీవల ఆ పార్టీకీ, పదవికీ కూడా కృష్ణయ్య రాజీనామా చేశారు.
ప్రస్తుతం అదే స్థానానికి ఆర్.కృష్ణయ్యను మరోసారి రాజ్యసభకు (Rajyasabha) పంపిస్తోంది బీజేపీ (BJP). వాస్తవానికి ఆర్.కృష్ణయ్య ఇప్పటివరకూ అధికారికంగా బీజేపీలో చేరలేదు. అయినా ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేయడానికి రేపు ఆఖరి రోజు. వైసీపికి తగిన బలం లేకపోవడంతో ఏపీలో ఖాళీ అయిన మూడు స్థానాలూ ఏకగ్రీవం కావడం ఖాయం. అప్పుడు ఆర్.కృష్ణయ్య దాదాపు మూడున్నరేళ్లపాటు ఎంపీగా కొనసాగే అవకాశం ఉంది. ఏపీ నుంచి రాజ్యసభకు పంపినా ఆయన సేవలను తెలంగాణలో వాడుకోవాలని బీజేపీ ఆలోచిస్తోంది. బీసీలను తమవైపు లాక్కునేందుకు ఆర్.కృష్ణయ్యకు ఎంపీ అవకాశం ఇచ్చిందని సమాచారం. మరి ఆర్.కృష్ణయ్య ద్వారా బీసీల ఓట్లు పార్టీలకు ఏమేరకు టర్న్ అయ్యాయో తెలీదు కానీ.. బీసీల మాటున ఆర్.కృష్ణయ్య మాత్రం బాగానే లబ్ది పొందారనే టాక్ బీసీల్లోనే వినిపిస్తోంది.













