Chandrababu: బిజేపి నేతకు రాజ్యసభ, చంద్రబాబు మది లో మాజీ సీఎం..?
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ (Rajya Sabha) స్థానానికి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల ఖాళీ అయిన మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా ఇప్పుడు మరో స్థానం ఖాళీ అయింది. దీంతో ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై స్పష్టత రావటం లేదు. ఈ స్థానం జనసేన తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రచారం గట్టిగానే జరుగుతోంది. అయితే ఈ విషయంలో జనసేన అంత ఆసక్తికరంగా లేదని నాగబాబుకి మంత్రి పదవి ఇస్తే చాలు అనే అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) పేరును పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కిరణ్ కుమార్ రెడ్డి మూడు నెలల క్రితం హైదరాబాదులో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ సీటుని కిరణ్ కుమార్ రెడ్డి అడిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఏపీలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని తనకు కేటాయించాల్సిందిగా ఆయన కోరారని ప్రచారం జరిగింది. 2024 ఎన్నికల్లో రాజంపేట లోక్సభ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత ఆయన పెద్దగా మీడియాలో కనపడలేదు. అయితే రాష్ట్ర మంత్రివర్గంలోకి ఆయనను తీసుకునే అవకాశం ఉందని వార్తలు గట్టిగానే షికారు చేశాయి. ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉండటంతో క్యాబినెట్ లోకి వస్తే ఫలితం ఉంటుందని చంద్రబాబు నాయుడు భావించారు. అయితే ఆ మంత్రి పదవి విషయంలో జనసేన కాస్త పట్టు పట్టడంతో చంద్రబాబు నాయుడు ఆలోచన విరమించుకున్నట్టు తెలిసింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపే విషయంలో చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరిగినా కిరణ్ కుమార్ రెడ్డి విషయంలోనే చంద్రబాబు ఆసక్తికరంగా ఉన్నారని, బిజెపి పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు ఆలోచనకు అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.













