కల్తీ నెయ్యి పాపం ధర్మారెడ్డిదేనా..? కమిషన్ నివేదికలో షాకింగ్ నిజాలు..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం, తిరుమల(Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ భారీ కుంభకోణానికి టీటీడీ(TTD) మాజీ ఈవో ధర్మారెడ్డి ప్రధాన కారకుడని ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తేల్చి చెప్పింది. తాజాగా మీడియాకు అందుతున్న సమాచారం ప్రకారం, శ్రీవారి నెయ్యి టెండరు నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సడలించడంలో ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించారని కమిషన్ నిర్ధారించింది.
సాధారణంగా టీటీడీకి సరఫరా చేసే నెయ్యి విషయంలో అత్యంత కఠినమైన నిబంధనలు ఉంటాయి. అయితే, ధర్మారెడ్డి హయాంలో ఈ నిబంధనలను సడలించడం ద్వారా నాణ్యత లేని, కల్తీ నెయ్యిని సరఫరా చేసే సంస్థలకు టీటీడీలోకి మార్గం సులభమైందని నివేదిక పేర్కొంది. అప్పట్లోనే నాణ్యతపై ఫిర్యాదులు వచ్చినా, సదరు సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి చర్యలు తీసుకోకుండా.. వాటినే కొనసాగించేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ధర్మారెడ్డి ప్రమేయం ఉందని కమిషన్ వెల్లడించింది. దీనివల్ల భక్తుల సెంటిమెంట్‌తో ఆడుకోవడమే కాకుండా, ప్రసాదం నాణ్యతను దారుణంగా దిగజార్చారని కమిషన్ ఆక్షేపించింది.
ఈ కల్తీ నెయ్యి కుంభకోణంలో ధర్మారెడ్డిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదించింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో అప్పటి ఈవో సింఘాల్ మరియు ఆర్థిక సలహాదారు బాలాజీల ప్రమేయంపై కూడా ప్రస్తావించడం గమనార్హం. నిబంధనల సడలింపు, ఆర్థిక లావాదేవీలు మరియు టెండర్ల ఖరారులో వీరి పాత్రపై కూడా విచారణ జరగాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేసిన అధికారులపై ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో అన్నది వేచి చూడాలి.








