Rajyasabha: నాకు కావాలి, రాజ్యసభకు గల్లా ప్రయత్నాలు
ఏపీలో ఒక రాజ్యసభ (Rajyasabha) స్థానం ఖాళీగా ఉండటంతో ఆ స్థానం నుంచి ఎవరు ఎంపిక అవుతారు అనేదానిపై స్పష్టత రావటం లేదు. ఇక మూడు పార్టీల నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై కూడా క్లారిటీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) మదిలో ఎవరున్నారు అనేదానిపై ఇటీవల కాలంలో చాలా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరును చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారని, దానికి జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా సానుకూలంగానే ఉన్నారనే వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు టిడిపి నుంచే ఆ స్థానానికి ఎక్కువగా పోటీ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. టిడిపిలో ఓ కీలక నేత ఆ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 2014, 2019లో గుంటూరు పార్లమెంటు నుంచి విజయం సాధించిన గల్లా జయదేవ్ ఇప్పుడు రాజ్యసభ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం కోసం ఆయన ప్రయత్నం చేయగా అందులో కేటాయించడం కుదరలేదు.
ఇక ఇప్పుడున్న స్థానానికి కచ్చితంగా ఆయన ఎంపిక కావడం లాంచనమే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ స్థానం విషయంలో పట్టుదలగా ఉండటంతో చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేది క్లారిటీ లేదు. అయితే గల్లా జయదేవ్ విషయంలో బిజెపి అగ్ర నేతలు అంత సానుకూలంగా లేరు అనే విషయం కూడా అర్థమవుతుంది. 2018 లో పార్లమెంట్ లో గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ గా చేసుకుని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఆయన మాట్లాడారు. దీనితో ఆయనకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించడాన్ని కొంతమంది నేతలు తప్పుపడుతున్నట్లుగా సమాచారం. అయితే గతం గతః అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు కూడా వ్యవహరిస్తున్నారని, గల్లా జయదేవ్ పార్లమెంట్లో ఉంటే కచ్చితంగా తనకు ఉపయోగం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.













