ముగిసిన దేవినేని నెహ్రూ అంత్యక్రియలు
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు దేవినేని ఉమ, ప్రతిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, నక్క ఆనంద్‌బాబు, జవహర్‌లతో పాటు ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమా, తంగిరాల సౌమ్య, ఎమ్మెల్సీలు కరణం బలరాం, బుద్దా వెంకన్న, ఇతర పార్టీల ముఖ్య నేతలు, నాయకులు పెద్దయెత్తున నెహ్రూ అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించారు.
విజయవాడ గుణదలలోని నెహ్రూ స్వగృహం నుంచి నున్న మార్కెట్‌కు వెళ్లే దారిలో ఉన్న వ్యవసాయ భూమి వరకు అంతిమయాత్ర కొనసాగింది. నెహ్రూ కుమారుడు అవినాశ్ కడసారి తండ్రి పార్థివదేహంపై మోకరిల్లి బోరున విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. అనంతరం అవినాశ్ అండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.













