గిన్నిస్ రికార్డు కోసం విద్యార్థినుల నృత్యం
విశాఖ నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 7వేల మంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థినులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కాలనే ధ్యేయంతో ఈ వేడుకను నిర్వహించారు. మంగళవారం ఉదయం 11:27 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూచిపూడి ప్రదర్శనను అధికారికంగా ప్రారంభించార. వరుసగా మూడు పాటలకు విద్యార్థినులంతా చక్కటి ప్రదర్శననిచ్చారు. గతంలో విజయవాడలో 6117 మంది విద్యార్థినులతో గిన్నిస్ రికార్డుకెక్కిన ఘనతను విశాఖలోని ప్రదర్శనతో దాటే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాల ప్రచార నేపథ్యంలో జరిగిన ఈ పోటీలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. గిన్నిస్ రికార్డు సాధనలో పాల్గొన్న విద్యార్థినులను, వారికి తర్ఫీదు ఇచ్చిన నిపుణుల్ని, యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.













