222 ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 54 పట్టణాల్లో 222 ఆరోగ్య కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు వైద్యులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తెలిసి తెలియని వైద్యంతో మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇటువంటి మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక వ్యవస్థ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. సెలవులు లేకుండా 365 రోజులూ ఈ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే ఈ తరహా వ్యవస్థ ఏర్పాటుచేసిన ఘటన మన రాష్ట్రానిదేనన్నారు. ఒత్తిడిని అధిగమిస్తే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని అన్నారు. ఆనందం ఉంటే ఆరోగ్యం ఉన్నట్లేనని అన్నారు. త్వరలో బాల సురక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తినే తిండి, ఆలోచించే విధానం సరిగాలేక రోగాలు వస్తున్నాయన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వారసత్వ రోగాలపై అవగాహన ఉండాలన్నారు. వైద్య సేవల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తామని ఆయన తెలిపారు.













