అమరావతిలో చైనా పెట్టుబడులు
రాజధాని అమరావతిలో గృహ నిర్మాణం, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనాకు చెందిన టోంగ్జౌ కన్స్ట్రక్షన్ జనరల్ కాంట్రాక్టింగ్ గ్రూప్ ఆసక్తి కనబరిచింది. రాజధానిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలపై సీఆర్డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనిలో టౌంగ్జౌ సంస్థ ఓవర్సీస్ సేల్స్ మేనేజర్ ఫాన్ బింగ్, వైస్ జనరల్ మేనేజర్ డింగ్ హాయ్ రోంగ్, చెన్నైకి చెందిన స్పార్టెక్ గ్రూప్ చైర్మన్ ్తత్రిపురనేని కృష్ణ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రతినిధి రామ్నాథ్, సీఆర్డీఏ ఆర్థిక అభివృద్ధి విభాగం డైరెక్టర్ వై.నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజధాని పరిధిలో ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్టులు, అవకాశాలపై నాగిరెడ్డి వివరించారు. వాటిలో ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులతోపాటు, ఉద్యోగులు సొంతంగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాజెక్టులూ ఉన్నాయని తెలిపారు. ఆయా కంపెనీలకు ఆసక్తి ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి సవివర ప్రతిపాదనలతో రావాలని సీఆర్డీఏ అధికారులు కోరారు.













