సెంటు రాజకీయం…
పేదలకు సెంటుస్థలం పేరుతో జగన్ సర్కార్ ప్రారంభించిన రాజకీయ అస్త్రంగానూ మారుతోంది. సెంటు స్థలమే బ్రహ్మాస్త్రంగా టీడీపీపై సంధించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. సెంటు స్థలం పంపిణీ వేగవంతం చేయాలని జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో పంపిణీకి కోర్టు నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. న్యాయ అవరోధాల దృష్ట్యా .. ముందుకు సాగడం కష్టమవుతోంది. మరోవైపు.. విపక్ష టీడీపీ సైతం తనదైన శైలిలో కౌంటర్లు వేస్తోంది
ఇటీవల చంద్రబాబు పర్యటనలకు జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. బాదుడే బాదుడు.. ఆ తర్వాత ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ చంద్రబాబు.. రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. వైసీపీ అవినీతి, అసమర్థపాలన చేస్తోందని.. ఉదాహరణలతో ప్రజలకు వివరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరిస్తామంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఈ సందర్బంగా సెంటు స్థలంపైనా ఆవేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
సెంటు స్థలం దేనికి సరిపోతుంది .. పేదలు సమాధులు కట్టుకోవాలా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దేశంలోనూ సీనియర్ నేత , ఎక్కువకాలం సీఎంగా, విపక్షనేతగా ఉన్న చంద్రబాబు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం టీడీపీ శ్రేణులను, రాజకీయ వర్గాలను సైతం నివ్వెరపరిచింది. మరోవైపు దీన్ని విపక్ష వైసీపీ అందిపుచ్చుకుంటోంది. చంద్రబాబుకు పేదలంటే చులకన అంటూ సజ్జల మండిపడ్డారు. లక్షల విలువైన సెంటు స్థలం పేదలకు కేటాయిస్తుంటే.. సమాధులు కట్టుకోమంటారా అని తీవ్రస్వరంతో ప్రశ్నించారు.
అయితే దీనికి టీడీపీ నేతలు సైతం అంతే ధీటుగా బదులిస్తున్నారు. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎక్కడో కొండలు, గుట్టల్లో ఉన్న స్థలాలను వారికి ఇస్తున్నామంటున్నారని.. వాటికి సౌకర్యాలు లేనప్పుడు అక్కడికెళ్లి పేదలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. 1













