విశాఖలో పెట్రో వర్సిటీ
మరో ప్రతిష్టాత్మకమైన సంస్థకు విశాఖపట్నం కేంద్రంగా మారనుంది. జిల్లాలో పెట్రోలియం విశ్వవిద్యాలయం నిర్మాణానికి కీలకమైన అడుగు పడింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. రూ.655.46 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న పెట్రోలియం, ఇంధన వర్సిటీకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ వర్సిటీ ద్వారా పెట్రోలియం విభాగంలో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, పరిశోధనలకు అవకాశమేర్పడుతుంది. కేజీ బేసిన్, విశాఖలో ఏర్పాటు చేస్తున్న పెట్రోలియం రిఫైనరీకి వర్సిటీని అనుసంధానం చేస్తారు. పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా పెట్రోలియం, ఇంధన వర్సిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. విశాఖ జిల్లా, సబ్బవరం మండలం వంగలి గ్రామ పరిధిలో ఈ పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణం జరగనుంది. ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించింది. శంకుస్థాపన కూడా పూర్తయింది.






