బీజేపీ నెక్స్ట్ మిషన్ తెలంగాణ!
పశ్చిమ బెంగాల్లో అనూహ్య విజయంతో దీదీ 15 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి తెరదించింది బీజేపీ. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇప్పుడు బీజేపీ తదుపరి టార్గెట్లపై దృష్టి పెడుతోంది. దేశవ్యాప్తంగా కాషాయ జెండాను రెపరెపలాడించడమే ధ్యేయంగా సాగుతున్న ఈ ప్రయాణంలో, కమలదళం కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోయే సెమీఫైనల్స్‌గా భావిస్తున్న 16 రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పక్కా స్కెచ్‌తో ముందుకు వెళ్తోంది.
వచ్చే రెండేళ్లలో దాదాపు 16 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఉత్తరాదిన పంజాబ్, దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను హస్తగతం చేసుకోవడం బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మక అంశంగా మారింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో పట్టును నిలబెట్టుకోవాలని చూస్తున్నప్పటికీ.. తెలంగాణలో పాగా వేయడం ద్వారా దక్షిణాదికి బలమైన సందేశం పంపాలని ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం భావిస్తోంది. ప్రత్యేకించి పంజాబ్, తెలంగాణల్లో రాజకీయం క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో, ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహాలకు పదును పెడుతోంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే కేవలం రాజకీయ విమర్శలు సరిపోవని గుర్తించిన కేంద్ర నాయకత్వం, అభివృద్ధి అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఈ నెల 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఇందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుందని భావిస్తున్న ఈ పర్యటనలో ప్రధాని భారీ వరాలను ప్రకటించనున్నారు. వరంగల్‌లో 1,695 కోట్లతో నిర్మించనున్న పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. మొత్తం 7,823 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించే ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణలో బీజేపీపై సానుకూలతను పెంచాలని అధిష్టానం యోచిస్తోంది.
రాజకీయ వ్యూహాల్లో భాగంగా కేంద్ర మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణకు మోదీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. పనితీరు ఆధారంగా మంత్రులకు ఉద్వాసన పలికి, రాబోయే ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు పెద్దపీట వేయనున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కొత్త ముఖాలకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. రాష్ట్రం నుంచి బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా, ఎన్నికల నాటికి కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని భావిస్తున్నారు.
వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న బీజేపీకి అధికారాన్ని నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఉనికిని చాటుకోవడం అంతకంటే ముఖ్యం. ఆ తర్వాత ఏడాది మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, త్రిపురతో పాటు తెలంగాణ, కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే బీజేపీ దృష్టంతా ఇప్పుడు తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ లపైనే ఎక్కువగా ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు శక్తినంతటినీ సమీకరించనుంది.
గత కొన్నేళ్లుగా తెలంగాణలో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీజేపీ, ఇప్పుడు పూర్తి స్థాయి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రధాని మోదీ పర్యటన, భారీ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర కేబినెట్ మార్పులు వంటివి కేవలం పరిపాలనపరమైన అంశాలే కాకుండా, ఒక పక్కా రాజకీయ ప్రణాళికలో భాగమే. మరి 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ 16 రాష్ట్రాల పోరులో బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కమలదళం వేస్తున్న ఈ వ్యూహాలకు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.
ఇవి కూడా చదవండి








