కుప్పంలో భారీ పెట్టుబడులు.. బిజీ బిజీగా సిఎం..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రేపటి నుండి మూడు రోజుల పాటు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో విస్తృతంగా పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా భారీ ఎత్తున అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆయన ఈ పర్యటనలో శ్రీకారం చుట్టబోతున్నారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనతో పాటు భారీగా ఉపాధి అవకాశాలను సృష్టించేలా ప్రభుత్వ యంత్రాంగం ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ముఖ్యమంత్రి ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగా కుప్పం పరిధిలో దాదాపు రూ. 3,847 కోట్ల విలువైన వివిధ పెట్టుబడుల ప్రాజెక్టులకు స్వయంగా శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితో పాటు నియోజకవర్గానికి మరిన్ని పరిశ్రమలను రప్పించేలా దాదాపు రూ. 1,026 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలపై (MoUs) కూడా ఆయన సమక్షంలో సంతకాలు జరగనున్నాయి. ఈ పారిశ్రామిక హబ్ ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కుప్పంలో నూతనంగా నిర్మించిన ఎంఎస్ఎంఈ (MSME) పార్కును, అలాగే ప్రతిష్టాత్మక ‘కడా’ (KADA) గెస్ట్‌హౌస్‌ను ప్రారంభించనున్నారు. వీటితో పాటు స్థానికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కుప్పం నూతన బస్టాండ్ కమ్ డిపో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక దాదాపు ఏడాదిన్నర సుదీర్ఘ విరామం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలోని తెలుగుదేశం పార్టీ (TDP) ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లనుండటంతో పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన ముఖాముఖి చర్చించనున్నారు.








