బాలినేని వర్సెస్ చెవిరెడ్డి.. నిజాలు బయట పెట్టేస్తున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో అదానీ లంచాల వ్యవహారం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అదానీ లంచాలు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదైంది. దీని నుంచి బయటపడేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాము అదానీతో ఒప్పందాలు చేసుకోలేదని.. సెకీతో మాత్రమే చేసుకున్నామని చెప్తోంది. అలాంటప్పుడు అదానీ లంచాలు ఎందుకిస్తారని ఎదురు ప్రశ్నిస్తోంది. అయితే తెరవెనుక ఏం జరిగిందో.. జగన్ సర్కార్ సెకీతో ఆగమేఘాలమీద ఎందుకు ఒప్పందం చేసుకుందో ఇప్పుడిప్పుడే విషయాలు బయటికొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటి వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చేసిన కామెంట్స్ మరింత అగ్గి రాజేశాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడ బాలినేని శ్రీనివాస రెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండేవారు. వాస్తవానికి విద్యుత్ ఒప్పందాలేవైనా కచ్చితంగా మంత్రి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే సెకీతో ఒప్పందం సమయంలో కూడా ఒప్పందాలపై సంతకం చేయాలని నాటి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అర్ధరాత్రి సమయంలో సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్ కాల్ చేశారని సమాచారం. అయితే అందులో ఏముందో తెలీకుండా ఇప్పటికిప్పుడు తాను సంతకాలు చేయలేనని తాను చెప్పినట్లు బాలినేని వెల్లడించారు. దీంతో మరుసటిరోజు కేబినెట్ మీటింగ్ లో ఈ ఒప్పందాలను అమోదించారని ఆయన వెల్లడించారు. అంటే మంత్రి ప్రమేయం లేకుండానే డీల్ కుదిరిపోయింది.
అయితే బాలినేని కామెంట్స్ ను వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖండించారు. వైసీపీని వీడి.. జనసేనలో చేరిన తర్వాత పవన్ కల్యాణ్ మెప్పుకోసం బాలినేని ఇలా మాట్లాడి ఉండొచ్చని విమర్శించారు. సెకీ ఒప్పందాల్లో బాలినేని సంతకం పెట్టినట్టు చెప్పారు. ఎమ్మెల్సీ పదవికోసం బాలినేని ఇంత దిగజారి మాట్లాడతారని తాను ఊహించలేదని చెవిరెడ్డి అన్నారు. ఏ కుటుంబమైతే బాలినేనికి అవకాశం కల్పించిందో వాళ్లపైనే ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. అయితే చెవిరెడ్డి కామెంట్స్ ను బాలినేని ఖండించారు. కుటుంబమంటే జగన్ ఒక్కరేనా.. తల్లి, చెల్లి లేరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే టికెట్లు ఇస్తామనే సంప్రదాయాన్ని ఎవరు మొదలుపెట్టారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. సెకీ ఫైల్ అసలు తన దగ్గరకు రానేలేదని స్పష్టం చేశారు.
బాలినేనికి, చెవిరెడ్డికి మధ్య ఎన్నికల ముందు నుంచే వార్ నడుస్తోంది. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. ఆయన నిర్ణయాన్ని బాలినేని తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే తనకు మరో మార్గం లేకపోవడంతో అయిష్టంగానే చెవిరెడ్డికోసం పనిచేశారు. అయితే ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు.. అయినా జిల్లాలో చెవిరెడ్డి పెత్తనం కొనసాగిస్తున్నారు. తానే అసలైన వైసీపీ ప్రతినిధి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీన్ని బాలినేని జీర్ణించుకోలేకపోయారు. దీంతో.. బాలినేని పార్టీకే గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు సెకీ ఒప్పందాలపై ఇద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం కొనసాగుతోంది.













