ఒంగోలు పంచాయతీ మళ్లీ మొదటికి…
ఒంగోలు వైసీపీ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే వచ్చి మళ్లీ మొదటికొచ్చింది. మెట్టుదిగినట్లే దిగి, మళ్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనారు. దీంతో ఇదెక్కడి సంతరా బాబు అన్నట్లుగా తయారైంది హైకమాండ్ పరిస్థితి. గట్టిగా అందామంటే ఎక్కడ బాలినేని హర్ట్ అవుతాడో, లేదంటే పార్టీ విధానం దెబ్బతింటుందన్న ఆందోళన తాడేపల్లి క్యాంపాఫీసులో కనిపిస్తోంది. పార్టీలో సీనియర్ నేత అయినప్పటికీ, హైకమాండ్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుండడంపై.. సీఎం జగన్‌లో సైతం అసంతృప్తి కనిపిస్తోందని సమాచారం.
మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు 75 సెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గ ఇంఛార్జుల్లో మార్పులు చేసిన వైసీపీ హైకమాండ్.. ఒంగోలు లోక్ సభ అభ్యర్ధి మార్పు విషయంలో తర్జన భర్జన పడింది. ఒంగోలు ఎంపీగా మాగుంటకే అవకాశం ఇవ్వాలని బాలినేని గత రెండు, మూడు వారాలుగా పట్టుబడుతూ వస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తాను చెప్పిన వారికే అవకాశం కల్పించాలని చాలా రోజుల పాటు అధిష్టానంపై ఒత్తిడి పెట్టారు. చివరకు ఒక అసెంబ్లీ సెగ్మెంట్ ఎర్రగొండపాలెంలో బాలినేని చెప్పిన తాటిపర్తి చంద్రశేఖర్‌కే బాధ్యతలు అప్పగించింది పార్టీ. కొండెపి, సంతనూతలపాడులో మాత్రం తన లెక్కల ప్రకారం మంత్రులు మేరుగ, ఆదిమూలంకు అప్పగించారు. ఈ విషయం పై బాలినేని వారం క్రితం బాహాటంగానే వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు ఒంగోలు అభ్యర్ధి విషయంలో మాగుంటను తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది పార్టీ హైకమాండ్. ఈ విషయంలోనూ బాలినేని రెండు మూడు దఫాలుగా అలిగి, పార్టీ పై ఒత్తిడి పెంచారన్న ప్రచారం జరుగుతోంది. సజ్జల, విజయసాయిరెడ్డిలతో పలుమార్లు సమావేశమై తన అభిప్రాయాన్ని బలంగా వినిపించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా బాలినేనిని పిలిచి మాట్లాడారు. మాగుంటను కొనసాగించలేమని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఒంగోలులో ప్రత్యామ్నాయ అభ్యర్ధి కోసం వేట సాగించి చివరకు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఒంగోలు లోక్ సభ బరిలో చెవిరెడ్డిని నిలబెట్టాలని అధిష్టానం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను కూడా బాలినేని వ్యతిరేకిస్తున్నారు. దీంతో రెండు రోజుల కిందట మరోసారి పార్టీ పెద్దలు బాలినేనిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కాంప్రమైజ్ అయినట్టు కనిపించిన బాలినేని నియోజకవర్గానికి వెళ్లి, వాళ్లకు లేని బాధ నాకెందుకు అంటూ వైరాగ్యాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ పరిణామాల మధ్యలో పార్టీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒంగోలు లోక్ సభ ఇంఛార్జ్ పేరును ప్రకటించకుండా ఆపిన అధిష్టానం వ్యూహాత్మకంగా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పార్టీ బాధ్యతల్లో భాగంగా చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రీజనల్ కోఆర్డినేటర్ గా నియమించింది. దీనితో పాటు మరో మూడు నియోజకవర్గాలు సంతనూతలపాడు, కందుకూరు, కావలి పార్టీ బాధ్యతలను కూడా చెవిరెడ్డి చేతిలో పెట్టింది. ఈపరిణామంతో షాక్ కు గురైన బాలినేని మరోసారి అలకపానుపు ఎక్కారు.
తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పూటకోసారి అలగుతున్న బాలినేని తీరు పై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్లు సమాచారం. సీనియర్ నాయకుడు అయి ఉండి, ఎన్నికల ముందు ఈ విధంగా వ్యవహరించటం వల్ల క్యాడర్ గందరగోళానికి లోనవుతుందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అవుతోంది. పూటకోసారి అలిగితే బాలినేని స్థాయి తగ్గుతుందన్న చర్చ తాడేపల్లి సర్కిల్స్ లో జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బాలినేని ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో అన్న ఆసక్తి కలుగుతోంది.













