జగన్ చేతికి సుప్రీం ఆయుధం.. చంద్రబాబుపై కొరడా ఝళిపించబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎలాంటి పరిస్థితి ఉందో అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ మధ్య వార్ ఉధృతమైంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికారంలో ఉండడంతో స్వతహాగానే వైసీపీకి బలం ఎక్కువుంటుంది. దాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తోంది. చంద్రబాబు హయాంలోని లోటుపాట్లను తవ్వి తీస్తోంది. ఎన్నికల్లో చంద్రబాబును ఎదుర్కోవాలంటే వీటినే ఆయుధాలుగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది.
2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో అనేక అక్రమాలు జరిగాయని, ముఖ్యంగా రాజధాని అమరావతి పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని వైసీపీ చెప్తోంది. అమరావతి సహా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. అయితే ఇలా గత ప్రభుత్వాల నిర్ణయాలను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తప్పుబడుతూ శిక్షలు వేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందని టీడీపీ వాదించింది. సిట్ ను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సిట్ పై స్టే విధించింది.
అయితే సిట్ పై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ ప్రభుత్వం. దీనిపై సుదీర్ఘ వాదోపవాదనలు జరిగాయి. గత ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే దానిపై చర్యలు తీసుకోకుండా ఎలా ఉండగలమని వాదించింది ప్రభుత్వం. చివరకు ఇవాళ హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. హైకోర్టు నిర్ణయం సమంజసంగా లేదని అభిప్రాయపడింది. అలా స్టే విధిస్తే వందశాతం ఇమ్యూనిటీ ఇచ్చేనట్టే కదా అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆయుధం దొరికినట్లయింది.
ఇన్నాళ్లూ చంద్రబాబు అండ్ కో పై విచారణ జరిపేందుకు ఆటంకాలు ఎదురుకావడంతో జగన్ ఏమీ చేయలేకపోయారు. చంద్రబాబుకు నోటీసులు కూడా ఇచ్చి ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో జగన్ కు వజ్రాయుదం లభించినట్లే. దీన్ని అడ్డు పెట్టుకుని టీడీపీపై ఓ రేంజ్ లో విరుచుకుపడేందుకు వైసీపీ సిద్ధం కావడం ఖాయం. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైం ఉంది. ఈలోపు చంద్రబాబును ఇరికించాలని జగన్ ఆలోచిస్తున్నారు. ఇప్పటివరకూ చాలా అంశాల్లో చంద్రబాబును బుక్ చేసేందుకు చాలా ట్రై చేశారు. కానీ ఏవేవో కారణాల వల్ల కుదరలేదు. మరి ఇప్పుడైనా ఆ విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.













