ముందస్తు కోసమే ఎమ్మెల్యేలతో జగన్ మీటింగా…??
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్త జోరందుకుంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఈ ఊహాగానాలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. ముందస్తుకు వెళ్లేందుకే జగన్ ఢిల్లీ వెళ్లి పీఎం మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారని భావిస్తున్నారు. ఇదే సమయంలో ఏప్రిల్ 3న పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం అవుతుండడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది. పార్టీ నేతలు కూడా జగన్ ముందస్తుకు వెళ్తారేమో అనే సందేహాలు మొదలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది మే లో జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జూన్ 8 వరకూ ఈ ప్రభుత్వానికి గడువుంది. ప్రజా తీర్పును పూర్తిగా వినియోగించుకుంటామని, ఒక్క రోజు కూడా వదులుకోబోమని గతంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. చాలా సందర్భాల్లో ముందస్తు మాట వినిపించినా ప్రతిసారీ వైసీపీ అధిష్టానం మాత్రం తమకు అలాంటి ఆలోచన లేదని, ప్రతిపక్షాలు ఈ అంశంపై కలలు కంటున్నాయని చెప్పుకుంటూ వచ్చారు.
వైసీపీ ఖండిస్తూ వస్తున్నా విపక్షాలు మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చాలా కాలం నుంచి చెప్తూ వస్తున్నాయి. అందుకు తగ్గట్టు శ్రేణులను ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ముందస్తుకు సంబంధించి అధికార పక్షంలో కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని ఇటీవల సర్వేలు చెబుతుండడం, అందుకు తగ్గట్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడం, సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబావుటా ఎగరవేయడం.. లాంటి అనేక అంశాలు జగన్ ను ముందస్తుకు వెళ్లేలా పురిగొల్పుతున్నాయని చెప్తున్నారు.
ఏప్రిల్ 3న పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మీటింగులో ముందస్తుకు సంబంధించిన విషయాలను జగన్ పార్టీ నేతలకు వివరిస్తారని భావిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలోనే జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లింది ముందస్తుకోసమేనని చెప్తున్నారు. తన ఢిల్లీ పర్యటన విషయాలను కూడా జగన్ చర్చిస్తారని సమాచారం. ఒక వేళ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం ఉంటే ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్టీపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణ.. లాంటి అంశాలను జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది.













