ఏపీలో ముందస్తు ఖాయమా..? ఎన్నికలకు జగన్ రెడీ అయిపోయారా..?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలపై మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ఓ దినపత్రికలో వచ్చిన కథనం ఇందుకు ఆధారం. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు కొత్తకాదు. దాదాపు ఏడాది నుంచే ఈ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఒక్క రోజు కూడా తమకు దక్కిన అధికారాన్ని వదులుకోబోమని స్పష్టం చేసేసింది. అయినా ఎక్కడో ఏవో అనుమానాలు ముందస్తు ఎన్నికల వార్తలకు దోహదపడుతున్నాయి.
2019లో తొలిసారి ఏపీలో అధికారంలోకి వచ్చింది వైసీపీ. తమకు దక్కిన ఐదేళ్ల అధికారాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని వైసీపీ ఇప్పటికే పలుమార్లు తేల్చి చెప్పింది. ఆ అవసరం తమకు లేదని, ప్రతిపక్షాలు అధికారం కోసం ఆరాటపడుతున్నాయని ఆ పార్టీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సీఎం జగన్ కూడా ముందస్తుపై క్లియర్ కట్ గా తన వైఖరిని గతంలోనే చెప్పేశారు. ఒక్క రోజు కూడా వదులుకోబోమని తేల్చేశారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయనేది వైసీపీ నేతలు చెప్తున్న మాట.
ఆరు నెలలకు ముందు ఉన్న ధీమా ఇప్పుడు వైసీపీలో కనిపించడం లేదు. అప్పటివరకూ 175కు 175 సీట్లూ గెలవాలని, గెలుస్తామని చెప్తుండేవారు వైసీపీ నేతలు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురుకావడం, సొంతపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ప్లేటు ఫిరాయించడం వైసీపీకి పెద్ద ఝలక్ ఇచ్చినట్లయింది. దీంతో వైసీపీ అధినేత జగన్ కాస్త దిగివచ్చారు. అంతవరకూ ఆదేశాత్మక ధోరణతో వ్యవహరించిన జగన్.. ఇప్పుడు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. జగన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని వైసీపీ నేతలే చెప్తున్నారు. మరింతమంది నేతలు గోడ దూకుతారనే భయమే ఇందుకు కారణం.
మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఆందోళన కరంగా ఉంది. ఒకవైపు ఉద్యోగులు తమ డిమాండ్లకోసం పట్టుబడుతున్నారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నారు. కనీసం జీతాలు కూడా సమయానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడది అమలు చేసే పరిస్థితి లేదు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలకు కూడా కోతలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు ఆలస్యం చేస్తే పార్టీలో అసంతృప్తులు తారస్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అది పార్టీపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
అన్నిటికీ మించి సమయం ఎక్కువ ఇస్తే ప్రతిపక్షాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. అందుకే జగన్ ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. పైకి చెప్పకపోయినా గుంభనంగా లోలోపల అన్ని పనులను చక్కబెడుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ లను భారీగా ట్రాన్స్ ఫర్ చేసేసేంది ప్రభుత్వం. త్వరలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని సమాచారం. అనంతరం అక్టోబర్ లో అసెంబ్లీ రద్దు చేసి డిసెంబర్ లో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇవన్నీ ఊహాగానాలే. మరి ఇది నిజమవుతుందో.. లేదో .. వేచి చూడాలి.













