పవన్ కల్యాణ్ పై ముద్రగడ పద్మనాభం పోటీ..!? వైసీపీ సూపర్ స్కెచ్..!?
కాపు ఉద్యమ నేతగా పేరొందిన ముద్రగడ పద్మనాభం చాలా కాలంగా యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అయితే తను కాపులకోసమే పుట్టానని, వాళ్లకోసం ఏమైనా చేస్తానని చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసం ఎవరితోనైనా కలిసేందుకు వెనుకాడరు. కాపులను అడ్డు పెట్టుకుని స్వప్రయోజనాలకోసమే ముద్రగడ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారని కొందరు ఆయనపై ఆరోపణలు చేస్తుంటారు. ఇప్పుడాయన పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారని టాక్. త్వరలోనే ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని సమాచారం.
కాపుల ఓట్లకోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీకి కాపులు అండగా నిలిచారు. అందుకే ఘన విజయం సాధించింది. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదని అర్థమవుతోంది. పవన్ కల్యాణ్, చిరంజీవి సహా కాపు నేతలను వైసీపీ ప్రభుత్వం వేధించిందనే ఫీలింగ్ వారిలో ఉంది. గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్ల విషయంలో వైసీపీ వైఖరి కూడా కాపులకు ఏమాత్రం రుచించలేదు. వైసీపీ కూడా తమను ఓటు బ్యాంకుగా పరిగణనిస్తోంది తప్ప తమకు చేసిన ప్రయోజనం ఏమీ లేదని ఆవేదన వాళ్లలో కనిపిస్తోంది. పైగా ఈసారి కాపు ఓటు బ్యాంకు పవన్ కల్యాణ్ వైపు వెళ్తుందనే అంచనాలు కూడా వైసీపీని కలవరపెడుతున్నాయి.
అందుకే కాపులను ఆకట్టుకునేందుకు ఏదో ఒకటి చేయాలనే తపన జగన్ లో కనిపిస్తోంది. అందుకే మొదటి నుంచి తమకు అండగా నిలుస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని మళ్లీ తెరపైకి తేవాలనుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమాన్ని తెరపైకి తీసుకురావడం వెనుక వైసీపీ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలి వచ్చాక తుని రైలు ఘటనలో నమోదైన కేసులను ఎత్తేసింది. దీంతో తాము కాపుల పక్షపాతి అని చెప్పుకునేందుకు ఆస్కారం లభించింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ద్వారా వారిని మరింతగా ప్రసన్నం చేసుకోవాలనుకుంటోంది.
ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. ఆయన కూడా ఆ సీటును ఆశిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు జనసేనలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన కూతురు, అల్లుడు ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. దీంతో దొరబాబు స్థానంలో ముద్రగడకు టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగొచ్చొనే టాక్ నడుస్తోంది. అదే జరిగితే ఈ స్థానంలో పోటీ రసవత్తరంగా మారుతుంది.













