జగన్ గుండెల్లో గుబులు రేపుతున్న ఐప్యాక్ నివేదిక..!??
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. వైసీపీ, టీడీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. టీడీపీ అప్పుడే మేనిఫెస్టో కూడా ప్రకటించేసింది. ఎన్నికలకు ఇక సరిగ్గా ఏడాది సమయం ఉంది. అయితే మిగిలిన రాష్ట్రాలతో పాటు ఈ ఏడాది చివర్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందులో బాగంగానే పార్టీపై ఎక్కువగా దృష్టి సారించారని చెప్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేస్తోంది ఐప్యాక్ టీమ్. అయితే ఈసారి ఐప్యాక్ ఇచ్చిన నివేదిక వైసీపీకి ఏమాత్రం మింగుడు పడట్లేదని సమాచారం.
కొన్నేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తోంది. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ఐప్యాక్ ఎంతో కీలక పాత్ర పోషించింది. ఈసారి కూడా ఐప్యాక్ నే నమ్ముకున్నారు జగన్. వైసీపీని జనాల్లోకి తీసుకెళ్లేందుకు, జగన్ పట్ల పాజిటవ్ దృక్పథాన్ని పెంపొందింపజేసేందుకు ఐప్యాక్ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అంతేకాక, నియోజకవర్గాల వారీగా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితిని, నేతల పనితీరును అంచనా వేస్తోంది. నివేదికలను పార్టీ అధినేత జగన్ కు అందిస్తోంది. దానికి అనుగుణంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
గత నెలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా జగన్ ఏ ఒక్కరినీ వదులుకోబోనని, అందరూ తనతోపాటు అసెంబ్లీకి రావాలని కోరుకుంటునన్నానని చెప్పారు. దీంతో సిట్టింగ్ లంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు మళ్లీ సీటు ఖాయమని భావించారు. అయితే తాజాగా ఐప్యాక్ ఇచ్చిన నివేదిక మాత్రం సిట్టింగుల్లో చాలా మంది అన్ ఫిట్ అని తేల్చింది. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం లేదని, వాళ్లకు మళ్లీ టికెట్లు ఇస్తే పార్టీ ఓడిపోవడం ఖాయమని ఐప్యాక్ స్పష్టం చేసిందట. దీంతో జగన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలను వైసీపీ కోల్పోయింది. ఇది జగన్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఐప్యాక్ నివేదిక జగన్ కు మరింత ఆందోళన కలిగిస్తున్నట్టు సమాచారం. సిట్టింగులకు సీట్లు నిరాకరిస్తే వాళ్లు పార్టీ మారి నష్టం కలిగిస్తారు. అలాగని టికెట్లు ఇస్తే పార్టికి నష్టం జరగొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలో అర్థంకాక జగన్ అంతర్మథనం చెందుతున్నారు. పైగా రాయలసీమ లాంటి కంచుకోటలోనే దాదాపు 15 మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఐప్యాక్ నివేదించినట్లు సమాచారం. ఇలాంటి ఆటుపోట్లన్నింటినీ తట్టుకుని జగన్ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది.













