జగన్పై అందరి ఆరోపణా అదే..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి రోజురోజుకూ పెరిగిపోతోంది. పార్టీలు పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయి. నేతలు టికెట్లకోసం పార్టీల చుట్టూ తిరుగుతున్నారు. ఏ పార్టీ నుంచయితే తమకు విజయం సులువుగా ఉంటుందో లెక్కలేసుకుంటున్నారు. మరోవైపు కొంతమంది నేతలకు పార్టీలు టికెట్లు నిరాకరిస్తుండడంతో అలాంటి నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఈ విషయంలో అధికార వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే 60కి పైగా స్థానాల్లో టికెట్లు ఖరారు చేశారు వైసీపీ అధినేత జగన్. వీళ్లలో సుమారు 30 మంది సిట్టింగులకు టికెట్లు నిరాకరించారు. దీంతో అసంతృప్తి తారస్థాయిలో ఉంది.
జగన్ టికెట్లు నిరాకరించిన పలువురు నేతలు వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్టీల్లో చేరిపోయారు. మరికొంతమంది నేతలు చర్చల దశలో ఉన్నారు. త్వరలోనే మరికొంతమంది నేతలు కూడా పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే వాళ్లు ఓడిపోతారు కాబట్టే మేం టికెట్లు ఇవ్వట్లేదని.. అలాంటి వాళ్లను విపక్షాలు చేర్చుకుంటున్నాయని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అలాంటి నేతలు వెళ్లిపోయినా తమకు వచ్చే నష్టమేం లేదంటున్నారు.
వైసీపీ నుంచి వెళ్లిపోతున్న నేతలను జగన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. పోతేపోనీ.. అన్నట్టు చాలా లైట్ తీసుకుంటున్నారు. ప్రజలు తనను చూసి ఓట్లేస్తారని.. ఎమ్మెల్యే అభ్యర్థిని చూసి కాదని జగన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీని వీడిన పలువురు నేతలు బహిరంగంగానే చెప్తున్నారు. అంతకుమించి విపక్ష నేతలను తిట్టాలని జగన్ ఆదేశిస్తున్నారని.. అలా చేయని వాళ్లకు టికెట్లు ఇవ్వట్లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు, అంతకుముందు కొలుసు పార్థసారథి కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ నిరాకరించడం వెనుక కూడా ఇదే కారణమనే ఆరోపణలున్నాయి. దీంతో ఇదేం సంస్కృతి అని పలువురు నేతలు ఆశ్చర్యపోతున్నారు.
చంద్రబాబు, లోకేశ్ ను తిట్టకపోతే మిమ్మల్ని ఎలా ఓన్ చేసుకోవాలి.. అని జగన్ అంటున్నారని కానీ రాజకీయం అంటే తిట్టడం కాదని పలువురు నేతలు చెప్తున్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని అక్కడ ఉండలేమని బయటకు వచ్చేస్తున్నట్టు చెప్పారు. ఒకరో ఇద్దరో ఇలాంటి మాటలు చెప్తే అది నిజం కాకపోవచ్చని అనుకోవచ్చు. కానీ బయటకు వచ్చిన మెజారిటీ నేతలు ఇదే విషయం చెప్తుంటే ఇదే నిజం అని నమ్మే అవకాశం ఉంది.













