BJP: నమ్ముకున్నోళ్లకే పదవులు.. బీజేపీ నిర్ణయాలపై సర్వత్రా ప్రశంసలు..!!

భారతీయ జనతా పార్టీ (BJP) రాజకీయాల్లో కార్యకర్తలకు న్యాయం చేయడంలో, వారి కృషిని గుర్తించి పదవులతో సత్కరించడంలో ఇతర పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తన సిద్ధాంతాలకు కట్టుబడి, పార్టీని నమ్ముకున్న వారికి అవకాశాలు కల్పించడంలో ముందుంది. ఇతర పార్టీల నుంచి చేరిన నాయకులను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పోటీ చేయించి, వారి సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. అదే సమయంలో, సుదీర్ఘకాలంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల ద్వారా గౌరవం అందిస్తోంది. ఈ విధానం బీజేపీని ఇతర పార్టీలకు భిన్నంగా నిలిపింది.
బీజేపీ తన కార్యకర్తలకు ఇచ్చే విలువను ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా చూడవచ్చు. సోము వీర్రాజు (Somu Veerraju), భూపతిరాజు శ్రీనివాస వర్మ (Bhupatiraju Srinivasa Varma), పాక వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana), కంభంపాటి హరిబాబు (Kambhampati haribabu) వంటి నాయకులు పార్టీ కోసం దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేశారు. వీళ్లకు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా, కేవలం సిద్ధాంతాలకు అనుగుణంగా నమ్మకంగా పార్టీని బలోపేతం చేశారు. బీజేపీ వీళ్లను గుర్తించి ఎమ్మెల్సీ, ఎంపీ, గవర్నర్లుగా ఉన్నత స్థానాలతో సత్కరించింది. పాక వెంకట సత్యనారాయణ తాజాగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇది కార్యకర్తలకు పార్టీ ఇచ్చే గౌరవానికి నిదర్శనం. శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా, సోము వీర్రాజు ఎమ్మెల్సీగా నియమితులయ్యారు. కంభంపాటి హరిబాబు గవర్నర్ అయ్యారు. ఇది బీజేపీలో క్రమశిక్షణ, అంకితభావం ఉన్నవారికి తప్పకుండా అవకాశాలు దక్కుతాయని చాటుతుంది.
బీజేపీలో చేరే ఇతర పార్టీ నాయకులకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా పోటీ చేసే అవకాశం ఇస్తుంది. ఉదాహరణకు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి (Sujana Chowdary), సీఎం రమేశ్ (CM Ramesh), కాంగ్రెస్ నుంచి వచ్చిన పురంధేశ్వరి (Purandeswari) వంటి నాయకులు ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా చాటుకోవాల్సి వచ్చింది. సుజనా చౌదరి ఎమ్మెల్యేగా, సీఎం రమేశ్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. పురంధేశ్వరి కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు ఉన్నత పదవులు, నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా లేదని ఈ విషయం చాటిచెప్తోంది.
బీజేపీ నుంచి టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలు చాలా నేర్చుకోవాలి. టీడీపీ, వైసీపీలు తరచూ ఇతర పార్టీల నుంచి చేరిన నాయకులకు, డబ్బున్న నాయకులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి. నిజమైన కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తుంటాయి. ఇది కార్యకర్తలలో అసంతృప్తికి కారణమవుతోంది. బీజేపీ మాత్రం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పార్టీలో విశ్వాసాన్ని నింపుతోంది. ఈ నేపథ్యంలో, టీడీపీ, వైసీపీలు బీజేపీ నుంచి నేర్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. బీజేపీ తన కార్యకర్తలకు న్యాయం చేయడం, ఇతర పార్టీల నుంచి చేరినవారికి ఎన్నికల ద్వారా అవకాశం ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.