బ్రేకింగ్: గూగుల్ పై చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం సమీపంలోని తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్(Google) డేటా సెంటర్‌కు ‘డీమ్డ్ డిస్కం’ హోదాను మంజూరు చేస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఒక ప్రైవేటు సంస్థకు ఇటువంటి ప్రత్యేక గుర్తింపు లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నిర్ణయంతో విశాఖపట్నం గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది.
విశాఖ సమీపంలో సుమారు 601.4 ఎకరాల భారీ విస్తీర్ణంలో రూ.1.35 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఈ గూగుల్ డేటా సెంటర్ రూపుదిద్దుకుంటోంది. డేటా సెంటర్ల నిర్వహణకు నిరంతరం భారీ స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థకు ‘డీమ్డ్ డిస్కం’ హోదా కల్పించడం వల్ల, ఆ సంస్థ ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలపై ఆధారపడకుండా నేరుగా విద్యుత్తును కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుంది. అంతేకాకుండా, తమ అవసరాలకు తగ్గట్టుగా సొంతంగా ట్రాన్స్మిషన్ లైన్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1 గిగావాట్ సామర్థ్యంతో కూడిన హైపర్ స్కేల్ ఏఐ (AI) డేటా సెంటర్‌ను గూగుల్ నిర్మిస్తోంది. దీనివల్ల రాష్ట్ర గ్రిడ్‌పై అదనపు భారం పడకుండా ఉండటమే కాకుండా, పారిశ్రామిక అవసరాలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా అందుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ కేంద్రం ద్వారా ఐటీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని ప్రభుత్వం ఆశిస్తోంది. విశాఖను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డేటా మేనేజ్మెంట్లో అగ్రగామిగా నిలబెట్టాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ ప్రాజెక్ట్ వెన్నెముకగా నిలవనుంది. అదానీ గ్రూప్ వంటి సంస్థల సహకారంతో గూగుల్ చేపడుతున్న ఈ మెగా ప్రాజెక్ట్, ఏపీ పారిశ్రామిక రంగంలో ఒక నూతన అధ్యాయానికి నాంది కానుంది.
ఇవి కూడా చదవండి








