Rayalaseema: మళ్లీ ప్రత్యేక రాయలసీమ నినాదం?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రాంతీయ వాదం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలోనే రాయలసీమ అస్తిత్వం గురించి చర్చలు జరిగాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ, గ్రేటర్ రాయలసీమ సాధన సమితి పేరుతో సరికొత్త ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి మద్దతుదారులు శ్రీకారం చుట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
చరిత్రను పరిశీలిస్తే, రాయలసీమను తెలంగాణలో కలపాలనే ప్రతిపాదనలు గతంలోనే వినిపించాయి. విభజన సమయంలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ‘రాయల తెలంగాణ’ కావాలని సోనియా గాంధీకి విన్నవించారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలను తెలంగాణతో కలిపితే అది ఒక బలమైన రాజకీయ శక్తిగా మారుతుందని ఆయన భావించారు. అప్పట్లో సోనియా గాంధీ కూడా భవిష్యత్తులో ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే, ఏపీని నిలువుగా విభజించి కర్నూలు, అనంతపురంలను తెలంగాణలోనూ, చిత్తూరు, కడపలను ఆంధ్రాలోనూ కలపాలని యోచించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి నేతలు దీనికి వత్తాసు పలికారు. కానీ, జయపాల్ రెడ్డి వంటి నేతల ఒత్తిడి కారణంగా అది సాధ్యపడలేదు.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొందరు సీమకు అన్యాయం జరుగుతోందని ఆందోళనలు చేపట్టారు. కానీ, 2019 నుండి 2024 వరకు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఈ గళం పూర్తిగా మూగబోయింది. ఆ సమయంలో రాయలసీమ గురించి ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, అమరావతికి నిధులన్నీ కేటాయిస్తున్నారనే సాకుతో ‘గ్రేటర్ రాయలసీమ’ నినాదాన్ని వైసిపి నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
అయితే రాయలసీమకు నిజమైన ద్రోహి వైఎస్ జగనే అని టీడీపీ విమర్శిస్తోంది. తమ హయాంలో రాయలసీమ అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్తోంది. చంద్రబాబు హయాంలో ఏమాత్రం నీటి సౌకర్యం లేని అనంతపురం జిల్లాకు కియా మోటార్స్ వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తోంది. దీని ద్వారా సుమారు 17వేల మందికి ఉపాధి లభించింది. అలాగే తిరుపతిని మొబైల్ ఫోన్ తయారీ హబ్‌గా మార్చామని వెల్లడించింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అమర రాజ బ్యాటరీస్ వంటి దిగ్గజ సంస్థ వేధింపులు భరించలేక తెలంగాణకు తరలిపోయిందని, జాకీ కంపెనీ, సోలార్ ప్రాజెక్టులు కూడా సీమను వీడాయని గుర్తు చేస్తోంది. ముఖ్యంగా జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ తెగిపోయినా, కనీసం బాధితులను పరామర్శించలేదని విమర్శిస్తోంది. రాయలసీమలో ఐఐటి (IIT), ఐఐఎస్ఆర్ (IISER), కర్నూలులో ట్రిపుల్ ఐటి (IIIT), సెంట్రల్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను చంద్రబాబు హయాంలోనే ఏర్పాటయ్యాయని తెలిపింది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాయలసీమను గ్రీన్ ఎనర్జీ, హార్టికల్చర్ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కూటమి నేతలు చెప్తున్నారు. 2024-25లో 190 టీఎంసీలు, 2025-26లో 213 టీఎంసీల నీటిని రాయలసీమకు అందించామని, అనంతపురంలో 84,000 కోట్ల పెట్టుబడితో భారీ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. రిలయన్స్, అదానీ, టాటా పవర్ వంటి సంస్థలు లక్షల కోట్ల పెట్టుబడులతో సీమలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయని వెల్లడించారు ఇక్కడ ఇప్పటికే 200కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఉన్నాయని, తద్వారా లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తోందని గుర్తు చేస్తున్నారు.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం పెట్టే ఖర్చు అంతా రాయలసీమకు అన్యాయం చేయడమే అని చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ ప్రేరేపితమని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి ప్రాజెక్ట్ భూముల అమ్మకం ద్వారా తనను తాను పోషించుకునే స్వయం సంవృద్ధి ప్రాజెక్ట్ అని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో, ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వెనుక ఉన్నది ప్రాంతీయ ఆకాంక్ష కంటే కూడా కోల్పోయిన ‘రాజ్యాధికారం’ కోసం సాగిస్తున్న పోరాటమేనని విమర్శిస్తోంది. సీమ ప్రజలు వాస్తవాలను గ్రహించి, రాజకీయ ఎత్తుగడలకు చిక్కకుండా అభివృద్ధి వైపు పయనించాల్సిన అవసరం ఉందని కోరుతోంది.
ఇవి కూడా చదవండి








