Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..!?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నాయకుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజ్యసభ (Rajyasabha MP) సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై (K.Annamalai) పోటీ చేయనున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. విజయసాయి రెడ్డి ఈ ఏడాది జనవరిలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి ఎన్నికల సంఘం (EC) షెడ్యూల్ ప్రకటించింది. ఏప్రిల్ 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మే 9న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఓట్లు లెక్కిస్తారు. జూన్ 2028 వరకు ఈ స్థానం నుంచి ఎన్నికయ్యే వారికి పదవీకాలం ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో ఎన్నిక నల్లేరుపై నడకే.
విజయసాయి రెడ్డి బీజేపీలో చేరి మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేస్తారనే పుకార్లు వచ్చాయి. అయితే తాను రాజ్యసభ రేసులో లేనని తాజాగా విజయసాయి రెడ్డి ప్రకటించారు. దీంతో ఈ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamilnadu) మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ (BJP) యువ నాయకుడిగా, ఉత్సాహవంతమైన నాయకత్వంతో అన్నామలై పేరు తెచ్చుకున్నారు. 2021 నుంచి 2025 వరకు ఆయన బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ తన ఓటు శాతాన్ని 2019లో 3% నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో 11%కి పెంచుకుంది. యువతలో గణనీయమైన ఆదరణ సంపాదించిన అన్నామలై, బీజేపీకి తమిళనాడులో కొత్త ఊపు తెచ్చారు. అయితే, AIADMKతో విభేదాల నేపథ్యంలో ఇటీవల అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ అధిష్టానం.
త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఎఐఏడీఎంకేతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఏఐఏడీఎంకేతో విభేదాల నేపథ్యంలో అన్నామలై స్థానంలో నైనార్ నాగేంద్రన్‌ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు. అన్నామలైకి జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సూచించారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నామలైని రాజ్యసభ బరిలోకి దింపాలనే ఆలోచన బీజేపీ హైకమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ అన్నామలై ఏపీ నుంచి పోటీ చేస్తే ఇక్కడ బీజేపీకి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది.
ఏపీ బీజేపీ నేతలు మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్ రెడ్డి, పాతూరి నాగభూషణం తదితరులు కూడా ఈ సీటుపై కన్నేశారు. తమ స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్నామలై వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అన్నామలైని కాదనుకుంటే స్మృతి ఇరానీ పేరు కూడా పరిశీలించే అవకాశం ఉందని ఢిల్లీ బీజేపీ వర్గాల సమాచారం.