అమరావతి తుది డిజైన్లు వచ్తేస్తున్నాయ్!
నవ్యాంధ్ర రాజధానిలో 900 ఎకరాల్లో నిర్మించనున్న గవర్నమెంట్ కాంప్లెక్స్‌కు మాస్టర్ ప్లాన్‌ను, అందులో రెండు ఐకానిక్ భవంతులైన అసెంబ్లీ, హైకోర్టులకు సంబంధించిన తుది డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు మే రెండో వారంలో అందజేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి వీటిని ఈ నెల 20-25 తేదీల మధ్య సమర్పిస్తారని తొలుత భావించినప్పటికీ మరింత పక్కా, సృజనాత్మకంగా డిజైన్లను రూపొందించే ఉద్దేశంతో సుమారు 2 వారాలు ఆలస్యంగా వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. రెండు మూడు డిజైన్లను రూపొందించి అందజేయనున్నట్లు తెలిసింది. వాటిలో అత్యుత్తమమైన డిజైన్‌ను ముఖ్యమంత్రి ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే పైనల్ డిజైన్ల రూపకల్పన ప్రక్రియ దాదాపు ఒక కొలిక్క వచ్చింది. ఇటీవల లండన్‌కు వెళ్లిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ, సీఆర్డీయే కమిషనర్ శ్రీధర్, తదితరులకు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు తాము రూపొందించిన గవర్నమెంట్ కాంప్లెక్స్ మాస్టర్ ప్లాన్, 2 ఐకానిక్ భవంతుల ముసాయిదా డిజైన్లను చూపించారు. అవి బాగానే ఉన్నాయన్న వారు మరింత మెరుగ్గా వాటిని రూపొందించేందుకు అవసరమైన సూచనలిచ్చారు. ప్రధానంగా అసెంబ్లీ భవనపు ఆకృతులు అమరావతికే ఒక ఐకాన్‌గా ఉండాలన్న సీఎం చంద్రబాబు ఆకాంక్షను నార్మన్ ఫోస్టర్‌కు తెలియజేసి, తదనుగుణంగా మార్పుచేర్పులు చేయాలని కోరారు. ఈ డిజైన్లను మే 2వ వారంలో నార్మన్ ఫోస్టర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. వాటిని పరిశీలించిన అనంతరం వాటిల్లో ఒక దానికి రాష్ట్రం ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందని సమాచారం.













