స్మృతి వనం ఏర్పాటు … నా పూర్వజన్మ సుకృతం
స్మృతి వనం ఏర్పాటు అవకాశం నా పూర్వజన్మ సుకృతమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటుచేయనున్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. అయినవోలు -శాఖమూరు గ్రామల మధ్య 20 ఎకరాల విస్తీర్ణంలో వీటిని నిర్మించనున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.97.64 కోట్లు కేటాయించింది. ఈ కార్యక్రమానికి 25 బౌద్ధ క్షేత్రాల నుంచి బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. అంబేడ్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మౌ గ్రామం నుంచి, పార్లమెంటు నుంచి మట్టిని తీసుకొచ్చి భూమిపూజలో వినియోగించారు. అనంతరం ముఖ్యమంత్రి అంబేడ్కర్ ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ కులవివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, తన జీవితాన్ని త్యాగం చేసిన సమాజ సేవకుడు అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ గొప్ప మానవతవాది, గొప్ప సామాజిక విప్లవకారుడు, అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు చాలా గొప్పవి అని అన్నారు. అంబేద్కర్ అసమాన ప్రజ్ఞాశాలి. అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. అంబేద్కర్ ప్రపంచం గర్వించదగ్గ విద్యావేత్త అని, అంబేద్కర్ స్ఫూర్తి భావితరాలకు అందజేయడం నా ధ్యేయం అని పేర్కొన్నాడు.













