‘‘గప్ చుప్’’గా, మీడియాకి దూరంగా వుంటూ బెంగాల్ లో బీజేపీని గెలిపించిన నేత..
బెంగాల్ లో బీజేపీ ఎట్టకేలకు విజయం సాధించింది. మమతా బెనర్జీని మట్టి కరిపించింది. దీని వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ కీలక నేత సుబేందు అధికారితో పాటు మరో అదృశ్య నేత కూడా వున్నారు. ఆయన పేరు ఎక్కడా రావడం లేదు. ఎవ్వరు కూడా బయటికి ఉచ్చరించడం లేదు. కానీ.. బెంగాల్ విజయం వెనుక ఆయన పాత్ర కూడా తక్కువేమీ కాదు. పార్టీ అప్పగించిన బాధ్యతలను ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెరవేర్చడంలో ఆయన సిద్ధహస్తుు. గతంలో హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ విజయం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బెంగాల్ లో మొదటి సారిగా బీజేపీ అధికారం చేపట్టడం వెనుక కూడా ఆయన పాత్ర వుంది.
ఆయన పేరు మంగళ్ పాండే. మంగళ్ పాండే బిహార్ లో మంత్రిగా పనిచేశారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం ఆయన్ను పార్టీ ఇంఛార్జీగా నియమించింది. బెంగాల్ లో బీజేపీ జెండా ఎగరడానికి మంగళ్ పాండే పాత్ర చాలానే వుంది.బెంగాల్లో ఏ నాయకుడికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి, అలాగే ప్రతి నియోజకవర్గానికి తగిన వ్యూహాన్ని ఎలా రూపొందించాలి వంటి అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించడానికి ఆయన అవిశ్రాంతంగా, విస్తృతంగా కృషి చేశారు.
ఇవి కూడా చదవండి
దీనికి ముందు మంగళ్ పాండేను 2017 లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల బాధ్యుడిగా కూడా నియమించింది బీజేపీ. ఆ సమయంలో సీనియర్ నాయకుడు వీరభద్ర సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ పాలిస్తోంది.అక్కడ కూడా అత్యంత సమర్థవంతంగా పనిచేసి, బీజేపీని అధికారంలోకి తెచ్చారు. దీనిపై అప్పట్లో ఆయన్ను అడగ్గా… తన పాత్ర ఏమీ లేదని, అంతా మోదీ, అమిత్ షా, బీజేపీ కార్యకర్తలదేనని వినమ్రంగా చెప్పి, తప్పుకున్నారు.
నిజానికి రాజకీయాల్లో ‘‘మిత భాషి’’అని మంగళ్ పాండేకి పేరుంది. దివంగత బిహార్ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ సహకారంతో పాండే రాజకీయాల్లోకి వచ్చారు. మీడియా ముందుకు వచ్చి, ప్రకటనలు, విమర్శలు చేయడం కంటే తెర వెనుక వుంటూనే పార్టీని చక్కదిద్దడం, కార్యకర్తలను తయారు చేయడం, సిద్ధాంతాన్ని ఆచరించడానికే మక్కువ చూపుతారు. మీడియా ముందుకు రావడం చాలా అరుదుగానే వుంటుంది.
ఎమ్మెల్సీగా వుంటూ బిహార్ ఆరోగ్య మంత్రిగా సేవలందించారు. 2025 లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సివాన్ సీటు నుంచి బరిలోకి దిగి, గెలుపొందారు.ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే విజయం సాధించారు. మండలిలో కూడా ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన మాత్రం తొణకని కుండే. కేవలం ఆచరణలోనే తన జవాబును ఇచ్చేవారు.
ఇప్పుడు బెంగాల్ లో కూడా అదే వ్యూహాన్ని అనుసరించారు. ఎక్కడ కూడా మీడియా కంట కనబడకుండా, కేవలం క్షేత్ర స్థాయిలో పనులను చక్కదిద్దారు. ఎవర్ని ఎక్కడ దింపాలో, ఎవర్ని ఎక్కడ ప్రచారం చేయించాలో, ఏఏ అంశాలు ప్రచారంలో వాడాలో కూడా మంగళ్ పాండే చాలా చక్కగా చేశారు.
ఇవి కూడా చదవండి








