త్వరలోనే ఎన్నారై పాలసీపై నిర్ణయం : కేటీఆర్
టీఆర్ఎస్ ఎన్నారై సభ్యత్వ గడువును ఈ నెల 10 వరకు పొడిగిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని దేశాల్లో తెలంగాణ ఎన్నారైలు ఆన్లైన్లో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సభ్యత్వ గడువు పొడిగించాలని టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆయనకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖలు ఉన్న 40 దేశాల నుంచి సభ్యత్వ నమోదుకు విశేష స్పందన వస్తున్నదని మహేష్ బిగాల తెలిపారు. వేలసంఖ్యలో సభ్యత్వాలు నమోదవుతుండటంపై కేటీఆర్ అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే ఎన్నారై పాలసీపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. గల్ఫ్‌లో చనిపోయినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని మహేశ్ బిగాల కేటీఆర్‌ను కోరారు.













