టీసీఏ కిక్ ఆఫ్ మీటింగ్ సూపర్ సక్సెస్.. ఒకే రాత్రిలో 50 వేలడాలర్ల విరాళాల హామీ!
ట్రైసిటీ ఇండియా అసోసియేషన్ (TCA) ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే రాబోయే ఉత్సవాల సన్నద్ధతలో భాగంగా నిర్వహించిన తొలి ‘కిక్ ఆఫ్ మీటింగ్’ (Kick-Off Meeting) ఊహించని రీతిలో గ్రాండ్ సక్సెస్ అయింది. తక్కువ వ్యవధిలోనే ప్రణాళికలు సిద్ధం చేసి ఏర్పాటు చేసినప్పటికీ, ఈ సమావేశానికి ప్రవాస తెలుగు భారతీయ సమాజం నుండి అద్భుతమైన స్పందన లభించింది. మొత్తం 75 మందికి పైగా ప్రతినిధులు, నిర్వాహకులు ఈ ప్రత్యేక సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
హోం మేడ్ ఫుడ్, ఆత్మీయ సాయం
ఈ సమావేశంలో పాల్గొన్న అతిథులందరికీ పూర్తి స్వదేశీ రుచులను గుర్తుచేస్తూ సంప్రదాయబద్ధమైన ‘హోం మేడ్ ఫుడ్’ అందించడం విశేషం. పెద్ద సంఖ్యలో వచ్చిన వారందరికీ తక్కువ సమయంలోనే వంటకాలు సిద్ధం చేయడంలో అసోసియేషన్ ప్రతినిధులతో పాటు దేవి, పద్మజ, సుభద్ర, భ్రమరా, అనిలజ, వల్లి, ఉమా మంత్రవాది, ప్రసాద్ గారలు స్వచ్ఛందంగా చేదోడు వాదోడుగా నిలిచి వంట అవసరాలలో సహాయం అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయవంతానికి నడుం బిగించిన మిత్రులందరికీ నిర్వాహక బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
దాతల ఉదారత..
టీసీఏ ఆశయాలను, వారు చేపట్టే సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను నమ్మి ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా నిలిచే దాతలు ఈసారి కూడా తమ ఉదారతను చాటుకున్నారు. ఎప్పుడు డొనేషన్స్ అడిగినా ముందడుగు వేసే లాయల్ డోనర్స్ అందరూ కలిసి ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే భారీగా నిధుల హామీలు ప్రకటించారు. కేవలం ఒక్క మీటింగ్ లోనే వివిధ కమిటీల నుండి దాతల నుండి 45 వేల డాలర్ల మేర విరాళాల కమిట్మెంట్ లభించింది.
మరో 5 వేల డాలర్లు రానున్నాయని, తద్వారా ఈ ఈవెంట్ ప్రారంభ నిధి కింద మొత్తం 50 వేల డాలర్ల (దాదాపు 42 లక్షల రూపాయలు) భారీ టార్గెట్ రీచ్ అయినట్లు నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. వీరితో పాటు మరికొంతమంది ప్రధాన దాతలు రాబోయే ఉత్సవాల పూర్తి బడ్జెట్ ప్రణాళికలను అసోసియేషన్ ఖర్చు పెట్టే పారదర్శక విధానాన్ని పరిశీలించిన తర్వాత తమ వంతు అదనపు విరాళాలను అందజేస్తామని కమిట్ అయ్యారు.
ఉమా మంత్రవాది గానం..
ఎంతో సరదాగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగిన ఈ కిక్ ఆఫ్ మీటింగులో ఉమా మంత్రవాది (Uma Mantravadi) పాడిన వినసొంపైన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అతిథులను ఎంతగానో అలరించాయి. రాత్రి జరిగిన ఈ అద్భుత క్షణాలకు సంబంధించిన కొన్ని అందమైన ఫోటోలను నిర్వాహకులు సామాజిక మాధ్యమాలలో పంచుకుంటూ, భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ఆత్మీయతతో ఎన్నో విజయవంతమైన ఫంక్షన్లను కలిసికట్టుగా చేసుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








