TLCA: వైభవంగా టిఎల్‌సిఎ సంక్రాంతి సంబరాలు
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం(TLCA) సంక్రాంతి, రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా, చరిత్ర సృష్టించేలా సాగాయి. జనవరి 25వ తేదీన ఫ్లషింగ్ లోని హిందూ టెంపుల్ (Hindu Temple) ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు ఎంతోమంది కుటుంబంతో సహా తరలిరావడంతో ఆడిటోరియం నిండిపోయింది. టిఎల్‌సిఎ చరిత్రలోనే సంక్రాంతి వేడుకకు ఇంతమందిరావడం ఇదే మొదటిసారని పలువురు పేర్కొనడం ఇందుకు నిదర్శనం. ఇది ఒక రికార్డు అని, టిఎల్ సిఎ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సుమంత్ రామ్ సెట్టి, ఆయన టీమ్ నిర్వహించిన ఈ తొలి వేడుక ఇంత బాగా హిట్ అవడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
కార్యక్రమం మధ్యాహ్నం గణేశ ప్రార్థనతో ప్రారంభమైంది. అధ్యక్షులు సుమంత్ రామ్ సెట్టి వేడుకలకు వచ్చిన ముఖ్య అతిధులను పరిచయం చేసి ఆహ్వానించారు. టిటిఎ వ్యవస్థాపకులు, ప్రముఖులు డా. పైళ్ళ మల్లారెడ్డి, తానా మాజీ అధ్యక్షులు, బిజినెస్ ప్రముఖులు జే తాళ్ళూరి, టిఎల్‌సిఎ బోర్డ్ చైర్ ఉమెన్ రాజి కుంచెం, లైఫ్ ట్రస్టీ, ప్లాటినం డోనర్ డా. పూర్ణ అట్లూరి, నెహ్రూ చెరుకుపల్లి, డా. కృష్ణారెడ్డి గుజవర్తి, ఉదయ్‌కుమార్ దొమ్మరాజు ఈ వేడుకలకు అతిధులుగా వచ్చారు. ముఖ్య అతిధిగా నసావు కౌంటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లయనెల్ జె. చిట్టి జిమ్ లాడెన్ అటార్నీ వచ్చారు. ఈ సందర్భంగా సుమంత్ రామ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. టిఎల్‌సిఎ అధ్యక్షపదవి తనకు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఈ బాధ్యతలను అప్పగించిన టిఎల్‌సిఎ ప్రముఖులకు, సభ్యులకు, మాజీ అధ్యక్షులకు ముందుగా ధన్యవాదాలను తెలియజేస్తున్నట్లు చెప్పారు. మనకి ఎన్నో పాఠాలను నేర్పిన గతము, మనకంటూ మనం సృష్టించుకునే భవిష్యత్తు ముఖ్యముగా ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే కార్యక్రమాలను సరికొత్తగా మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాము.
అందులో భాగంగానే సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని పిల్లలకు టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ అనీ మాస్టర్‌తో శిక్షణ ఇప్పించి వారిచేత ఈ వేడుకల్లో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించామని చెప్పారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన రంగోళి ఇతర పోటీలలో ఎక్కువమంది పాల్గొనేలా కృషి చేశాము. మొట్టమొదటిసారిగా సంక్రాంతి ప్రత్యేక సంచికను తీసుకువచ్చాము. ఈ సంచికకోసం, కార్యక్రమ నిర్వహణకోసం ఆర్థిక సహాయం చేసిన అందరికీ ధన్యవాదములు. అలాగే రాబోయే రోజుల్లో కూడా విభిన్న కార్యక్రమాలు టీముతో కలిసి చేస్తాము. నెలకోసారి ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎక్కువ కార్యక్రమాలతో చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాము. ఇందుకు మీరంతా సహకరించాలని ఆశిస్తున్నట్లు సుమంత్ రామ్ సెట్టి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చిన్నారులు, పెద్దలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. గాయని హారిక నారాయణ్, గాయకులతోపాటు యువ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ ఆధ్వర్యంలో జరిగిన పాటల కచేరి అందరినీ ఉత్సాహ పరిచింది. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమ తులను కూడా అందించారు. వచ్చిన వారందరికీ తెలుగు రుచులతో వివిధ వంటకాలను వడ్డిం చారు. ఈ వేడుకల విజయ వంతానికి, పోటీల నిర్వహణలో నాకు సహకరించిన టీముకు, పెద్దలకు, వలంటీర్లకు నా ధన్య వాదాలను తెలియ జేస్తున్నాను.







