సంప్రదాయంగా విశాల టొరంటో తెలుగు ఉగాది
గ్రేటర్ తెలుగు టొరొంటొ, మర్ఖం, బ్రాంప్టన్, మిస్పిసాగ, ఓక్విల్లె వాటర్ డౌన్, కిచెనెర్, వాటర్లూ, కేంబ్రిడ్జ్, హమిల్టన్, మిల్టన్ నగరాల నుంచి వచ్చిన వందలాది తెలుగు వారు ఎంతో వైభవంగా ఉగాది వేడుకలు చేసుకున్నారు. సంగీతం, నాట్యం, నాటకం, హాస్యం కలబోసిన నవరసాల వినోద కార్యక్రమాలతో ఆద్యంతం కార్యక్రమం ఆనందంగా సాగింది. అందమైన రంగవల్లులతో సభాప్రాంగణాన్ని తీర్చిదిద్దారు.
తెలుగు కల్చరల్ అసోషియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో సభ్యులు, జాతీయ గీతాలాపన తరువాత, ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఫౌండర్ మెంబర్స్, ఎగ్జిక్యుటివ్ మెంబర్స్ మరియు ట్రస్టీలు జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమం ప్రారంభించి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ టొరొంటోలోని తెలుగు వారి విజయాలను ప్రశంసించారు. పండిత్ సనత్ శ్రీరాంభట్ల పంచాంగ పఠనం చేయగా, ప్రఖ్యాత గాయని హన్సిక పొలిమేర శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలతో అలరించింది. టీసీఎజీటీ పూర్వాద్యక్షులు, ప్రస్తుత ట్రస్టీ సూర్య బెజవాడ అతిధులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ గత 20 యేళ్ళగా టీసీఏజీటీ చేస్తున్న కార్యక్రమాలను సభకు తెలియజేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చెసిన సిలికానాంధ్ర సంస్థాపక అధ్యక్షులు ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ మాతృభూమి ఋణాన్ని, మాతృభాష ఋణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు. సంస్కృతి వేరు, వినోదం వేరు, మన సంస్కృతి, సాహిత్యం, సంప్రదాయం అర్థం కావాలంటే మాతృభాష నేర్చుకోవడమొక్కటే మార్గమని తెలిపారు.
కూచిపూడి గ్రామం దత్తత తీసుకుని జయకూచిపూడి అన్న నినాదంతో భారతదేశంలోని తలమానికమైన ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతున్నామని, ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రవాస భారతీయులు చేయూతనిస్తున్నారని అన్నారు. కూచిపూడిలో నిర్మించ తలపెట్టిన సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి తమవంతు విరాళాలు అందించి, తద్వారా దాదాపు 100 గ్రామాలకు ఆరోగ్య దానం చేయాలని పిలుపునిచ్చారు. జయహో కూచిపూడి కెనడా కార్యకర్త సుధ వేమూరి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రేటర్ టొరొంటో తెలుగు ఎగ్జిక్యుటివ్ సభ్యులు, ట్రస్టీలు, సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు.













