వాషింగ్టన్ డీసీలో తానా-పాఠశాల నమోదు కార్యక్రమం
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి అమెరికాలో తెలుగు భాషాభివృద్ధి, పరివ్యాప్తి కోసం ప్రవాసుల చిన్నారుల కోసం నిర్వహిస్తున్న ‘‘తానా-పాఠశాల’’ విద్యార్థుల నమోదు కార్యక్రమం ఇటీవల వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈ విభాగ అధ్యక్షుడిగా భాను మాగులూరి నియమితులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాష సాంస్కృతిక వారథని అన్నారు. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. మన పిల్లలు ఏ భాషలో చదువుకున్నా.. చక్కటి తెలుగును వారికి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. అన్ని భాషల్లో గొప్ప భాష తెలుగు. అలాంటి తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు పాల్గొని భాను మాగులూరిని సత్కరించారు. యెండూరి సీతారామారావు, అవిర్నేని రమేష్ , ఆలంపల్లి రవి కుమార్, రమా దేవి (డిప్యూటీ డైరెక్టర్ ఖాదీ ఇండస్ట్రీస్), పొత్తూరి నాగసత్యనారాయణ రాజు, బిక్కిన వీర్రాజు, బాలచందర్, దయాకర్, శంకర్ ప్రసాద్ తదిదరులు పాల్గొన్నారు.







