NYTTA: న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA). వచ్చే ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్‌కు నాయకత్వం వహించనున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించడంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండుగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. వచ్చే ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల తెలిపారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, కమ్యూనిటీ ప్రముఖులు పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.
రవీందర్ కోడెల చిట్యాలవాసి
ఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంకు చెందిన రవీందర్ కోడెలల బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే చదివారు. ఆ తర్వాత హనుమకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఫెలోషిప్తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆతర్వాత డాక్టర్ రెడ్డీస్‌తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు.













