అమెరికాలో పెరిగిపోతున్న జాతి వివక్ష
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం ఆ దేశంలో జాతి వివక్ష పెరిగిపోతోందనేందుకు సాక్ష్యంగా ఎన్నో దారుణ ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. హోటల్‌కు వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లను రెసిడెన్సీ ప్రూఫ్ (నివాస ధ్రువీకరణ పత్రం) చూపించాలని అడిగాడో వెయిటర్. చివరకు సదరు కస్టమర్ తమ వద్ద ఓ ఐడీ చూపించిన తరువాతే పుడ్ సర్వ్ చేసేందుకు ఒప్పుకున్నాడు. పూర్తి వివరాలు చూస్తే, లాటిన్ అమెరికాకు చెందిన డయానా కారిల్లో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ఇటీవలే తన స్నేహితులతో కలిసి కాలిఫోర్నియాలోని సెయింట్ మార్క్ అనే రెస్టారెంట్‌కు వెళ్లి పుడ్ ఆర్డర్ చేశానని, అయితే , ఆ పదార్థాలను తీసుకువచ్చిన ఓ వెయిటర్ తాను వాటిని వడ్డించాలంటే రెసిడెన్సీ ఫ్రూప్ చూపించాలని అడిగాడని అమె చెప్పారు. ఎందుకని ప్రశ్నిస్తే తాను సర్వ్ చేసే ముందు మీరిక్కడి వారేనా అని తెలుసుకోవాలి కదా? అని ఎదురు ప్రశ్నించాడని తెలిపారు. చివరకు తనతో పాటు ఆమె స్నేహితులు వారి వద్ద ఉన్న రెసిడెన్నీ ఐడీలను చూపించామని ఆమె తెలిపారు. వెయిటర్ వివక్షపూరిత చర్యపై ఆ రెస్టారెంట్ మేనేజర్ ఫిర్యాదు చేశామని, మేనేజర్ తమకు క్షమాపణ చెప్పి మరో చోట కూర్చోవలసిందిగా చెప్పారని డయానా తెలిపారు. అయితే తాను తన స్నేహితులతో కలసి రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయానని చెప్పారు. అమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు నుంచి విమర్శలు అధికమవుతుండడంతో ఆ వెయిటర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. డయానాతో పాటు అమె స్నేహితులకు తమ రెస్టారెంట్లో వీఐపీ భోజనం ఆఫర్ చేస్తున్నట్లు ఆ రెస్టారెంటు ప్రకటించింది. ఆదాయంలో 10 శాతం చారిటీకి కూడా ఇస్తామని తెలిపింది.













