ఎన్నారైల నటన ప్రతిభకు తార్కాణం ‘గీతాంజలి’ – సుబ్బారావు చెన్నూరి
అమెరికాలో రెండు దశాబ్దాల కిందట స్థిరపడిపోయిన ఎన్నారైల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకే ‘గీతాంజలి’ సీరియల్‌ను నిర్మించినట్లు ఆ సీరియల్ నిర్మాత, తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు తెలిపారు. 1992 నుంచి అమెరికాతో తనకు అనుబంధం ఏర్పడిందని, 1995లో ‘గీతాంజలి’ సీరియల్ నిర్మాణంతో అది బలపడిందని చెప్పారు. 1992లో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడి ఎన్నారైలు స్టేజీల మీద తమ కళలను ప్రదర్శించడం చూశానని, అప్పుడే కొందరు ఎన్నారైలు ఏదైనా సీరియల్ నిర్మిస్తే తాము అందులో నటిస్తామని చెప్పారని, అప్పుడు వచ్చిన ఆలోచనే ‘గీతాంజలి’ అని సుబ్బారావు వివరించారు. ఈ సీరియల్ నిర్మాణం కోసం ఇండియా నుంచి కేవలం ఐదుగురు మాత్రమే అమెరికా వెళ్ళారని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చెన్నూరి బాలకృష్ణ, సుమ, సుమ అమ్మగారు విమలా మీనన్, కెమెరామెన్ సత్యంరాజు, దర్శకుడు దామరాజు కుమార్ అమెరికాలో 2నెలలపాటు ఉండి ఈ సీరియల్‌ను నిర్మించారని చెప్పారు.
న్యూజెర్సిలో ఉంటున్న డా. జననీకృష్ణ కొచ్చర్లకోట, నిర్మల కొచ్చర్లకోట, లక్ష్మీ వంగూరి, లక్ష్మీ తంగిరాల, బాల మద్దూరి, పద్మ ఇంగువ, సన్యాసిరాజు కలిదిండి, డా. కృష్ణశాస్త్రి వంగూరి, పరంజ్యోతి కొచ్చర్లకోట, లక్ష్మీనారాయణ తంగిరాల, శర్మ చిట్టి, నాగేంద్రుడు బుర్రా, సుబ్రహ్మణ్యం చతుర్వేదుల, శాంతకుమార్, వెంకటాచార్యులు దిట్టకవి, సురేష్, శ్రీకాంత్ కొచ్చెర్లకోటతోపాటు గీతా చిట్టి, బేబి ప్రియాంక, న్యూయార్క్‌కు చెందిన రాజగోపాల్ మురుకుట్ల, రామానుజరెడి&్డ వంగపాటి, అరవిందశర్మ ఈ సీరియల్లో నటించారని సుబ్బారావు చెప్పారు. వారి నటనను చూసి చాలామంది ముగ్దులైపోయారని, ఎందుకంటే వాళ్ళకు కెమెరా ముందు నటించడం ఇదే మొదటిసారి అయినా బాగా నటించారని చెప్పారు. ఈ సీరియల్‌కు రచనా సహకారం శివప్రసాద్ ఆకెళ్ళ, సూర్యనారాయణ మూర్తి ఆకెళ్ళ, ప్రియా చౌదరి చేశారని, సంగీతంను శశి ప్రీతం సమకూర్చారని సుబ్బారావు వివరించారు.













