NYTTA: సామాజిక కార్యక్రమాల్లో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా)
 
                                    ప్రభుత్వ పాఠశాలలు, అనాధ శరణాలయాల సందర్శన, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్
ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఉన్నత చదువు, సాంకేతిక విజ్ఞానం పెంచుకునే విషయాలను నిర్లక్ష్యం చేయవద్దని విద్యార్థులకు న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అధ్యక్షురాలు వాణి ఏనుగు సూచించారు. నైటా ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ సేవ కార్యక్రమాన్ని ఇతర ప్రవాస భారతీయ ప్రముఖులతో కలిసి వాణి ఏనుగు(Vani Enugu) ప్రారంభించారు.
భువనగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు, హైదరాబాద్ అనాధ పిల్లల వసతి గృహం, ఎయిడ్స్ బాధితుల పిల్లల సంరక్షణ చేపట్టే డిజైర్ సొసైటీలను సందర్శించి నైటా తరపున సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. సంకల్పం, సామాజిక స్పృహ, సముచిత సేవ పేరుతో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టింది.
నైటా అధ్యక్షురాలిగా ఇటీవలే ఎన్నికైన వాణి ఏనుగు ఆధ్వర్యంలో న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్, అకడమిక్ కౌన్సిలర్ రాజశేఖర్ వంగపాటి, నైటా ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసమ్, ఈసీ మెంబర్ శ్రీవాణి, వైస్ చైర్మన్ లక్ష్మణ్ ఏనుగు, ప్రముఖ తెలంగాణ కళాకారులు మిమిక్రీ రమేష్, రేలారే రేల గంగ, నల్లగొండ గద్దర నర్సన్న ఈ కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులను వివిధ రంగాలపై చైతన్యవంతం చేశారు.
మొదటగా భువనగిరి గంజ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఈ బృందం విద్యార్థులకు ఉన్నత చదువులు, సాంకేతిక రంగంపై పట్టు అవసరాలపై అవగాహన కల్పించారు. అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా విద్య, సాంకేతిక జ్ఞానం పెంచుకునే మార్గాల విషయంలో వెనుకడుగు వేయొద్దని, ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని పట్టువిడవకుండా కష్టపడాలని వాణి ఏనుగు సూచించారు. సోషల్ మీడియాలో సమయం వెచ్చించినా అది వ్యక్తిగత ప్రతిభకు పదును పెట్టేలా ఉండాలని అన్నారు. ప్రస్తుతం తామందరమూ అమెరికాలో స్థిరపడినా చిన్నతనంలో ఇలాంటి ప్రభుత్వ స్కూళ్లలోనే చదువుకున్నామని గుర్తు చేసుకున్నారు. కంప్యూటర్ విద్య, సాంకేతికతపై పట్టు పెంచుకోవాలని, అయితే ఐటీ ఆధారిత ఉద్యోగాలేకాకుండా అమెరికాలో విభిన్న రంగాల్లో మంచి భవిష్యత్ ఉందని ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. స్కూల్ కు ఒక ట్యాబ్ ను బహుకరించారు, కంప్యూటర్ ల్యాబ్ నెలకొల్పేందుకు సహకారంతో పాటు, టీచర్లకు జూమ్ ద్వారా అన్ లైన్ శిక్షణ ఇచ్చేందుకు సముఖత వ్యక్తం చేశారు. అలాగే భువనగిరిలో ప్రముఖ పాఠశాల శ్రీ వాణీ విద్యాలయాన్ని ఈ బృందం సందర్శించింది. స్వర్ణోత్సవ వేడుకలకు సిద్దమౌతున్న స్కూల్ పునర్ నిర్మాణం కోసం సహకారం అందించేందుకు సభ్యులు సుముఖత వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బొల్లారంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ పాజిటివ్ పిల్లల సంరక్షణకు పాటు పడుతున్న డిజైర్ సొసైటీని నైటా బృందం సందర్శించింది. డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ నీలిమలు ఎయిడ్స్ కు చికిత్స, వైద్యం, ఎదురయ్యే సవాళ్లు, ఆహార నియమాలపై అవగాహన కల్పించారు. సొసైటీలో ఉన్న విద్యార్థులకు ఉన్నత చదువులు, నైపుణ్య శిక్షణలో సహకారం అందించేందుకు తాము సిద్దంగా ఉంటామని నైటా ప్రతినిధులు వెల్లడించారు.
ఆ తర్వాత ఎల్ బీ నగర్ లో ఉన్న అనాథ వసతి గృహంలో ఉన్న వందకు పైగా విద్యార్థులతో నైటా ప్రతినిధులు చర్చా గోష్టిని నిర్వహించారు. అమెరికాలో ఉన్నత విద్య, కెరీర్ గైడెన్స్, విభిన్న రకాల వీసాల సమాచారంపై విద్యార్థులను సందేహాలను నివృత్తి చేశారు. చదువుకోవటంతో పాటు ఆసక్తి ఉన్న రంగం, కళలు, క్రీడలపై పట్టు పెంచుకోవాలని అలాంటి వారికే అంతర్జాతీయంగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులు మిమిక్రీ రమేష్, నల్లగొండ గద్దర్ నర్సన్న, రేలారే రేలా గంగ తమ ఆటపాటలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. చదువుతో పాటు మానసిక వికాసాన్ని పెంచుకోవాలని తమలో ఉన్న కళాకారులు వెలిసితీసి పదును పెడితే సమాజంలో మంచి గుర్తింపుతో పాటు విభిన్న రంగాల్లో స్థిరపడే అవకాశం దక్కుతుందని అన్నారు.











