ఆ సాహసమే నాకు పేరు తెచ్చింది…
నేను ప్రాణాలతో ఉండటం గొప్ప విషయం అన్నారు అలోక్ మాడ సాని. అమెరికా కన్సాస్‌లో జరిగిన జాత్యహంకార దాడిలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు కోల్పోగా, అలోక్ తీవ్రంగా గాయపడ్డారు. ఆనాటి ఘటనను గుర్తుచేసుకున్న ఆయన, ఆ రోజు రాత్రి ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్‌కు వెళ్లామని, అక్కడ ఆడమ్ వ్యూరిస్టన్ తమను ఉగ్రవాదులుగా పేర్కొంటూ దేశం విడిచి వెళ్లాలని అరుస్తూ కాల్పులు ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటికి జరిగిన విషయాన్ని నమ్మలేకపోతున్నా. శ్రీనివాస్‌ను ఎంతలా కోల్పోతున్నానో మాటల్లో చెప్పలేను. ఇష్టమైన మిత్రుడిని కళ్లముందే పోగొట్టుకున్న బాధను మరచిపోవడం చాలా కష్టం. అది మా ఇద్దరి విషయంలో జరిగింది అని అలోక్ చెప్పారు. దాడి ఆనంతరం దేశ, విదేశాల ప్రజలు తన క్షేమం కోరుకోవడం ఆనందం కలిగించిందన్నారు. కన్సాస్ ప్రభుత్వం శ్రీనివాస్ జ్ఞాపకార్థం మార్చి 16తేదీని ఇండియన్ అమెరికన్ రోజుగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.













