ట్రంప్ ఆదేశాలతో పత్రాలు లేకుంటే ఇక్కట్లే….!
అమెరికాలో ఉంటున్న భారతీయ నిపుణులకు అసలైన పరీక్ష మొదలైంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులపై ఇమిగ్రేషన్ అధికారులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు.
అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు, ప్రాసిక్యూటర్లకు, జడ్జీలకు అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ నుంచి ఆదేశాలు అందాయి. ఎంత కాలం నుంచి దేశంలో ఉంటున్నారన్న అంశంతో నిమిత్తం లేకుండా అక్రమ వలసదారులందరినీ నిర్బందించాల్సిందేనని ఆయన సృష్టం చేశారు. అక్రమ వలస దారులను గుర్తించడం, నిర్బంధించడం, వెనక్కి తిప్పి పంపడం అన్న నినాదంతో అధికారులు రంగంలోకి దిగుతున్నారు. అదుపులోకి తీసుకున్న అక్రమ వలసదారులను ఉంచేందుకు తగిన ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. మున్ముందు అక్రమ వలసదారుల కేసులు పెరిగే అవకాశం ఉండటంతో అదనంగా మరికొందరు జడ్జీలను కూడా ఇందుకోసం ప్రత్యేకంగా నియమించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించాలనుకొనే వారి ఆటలు ఇకపై చెల్లవని, అమెరికాలో ట్రంప్ శకం ప్రారంభమైందని అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ పేర్కొన్నారు.













