వైట్ హౌస్ ఎదుట ఇండో అమెరికన్ల ఆందోళన
అమెరికాలో పెచ్చు మీరుతున్న జాత్యాహంకార దాడుల పట్ల ఇండో అమెరికన్లు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్ ఎదుట ఆందోళన చేపట్టారు. భారత సంతతికి చెందిన హిందువులు, సిక్కులు అమెరికాలో విద్వేషపూరిత దాడులకు బలవుతున్న నేపథ్యంలో నిరసనను చేపట్టారు. ఈ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీని నిర్వహించారు. అమెరికాలో విద్వేషానికి హిందువులు ఎక్కువగా బాధిలవుతున్నారని వర్జీనియాకు చెందిన న్యాయవాది విద్య అడపా తెలిపారు. ఇది అధికార యంత్రాగానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళన కాదని, విద్వేష పూరిత ర్యాలీలకు వ్యతిరేకంగానే నిరసన ర్యాలీలు చేపట్టినట్లు తెలిపారు. విద్వేష ఘటనలకు వ్యతిరేకంగా ట్రంప్ యంత్రాంగం మద్దతివ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. అధ్యక్షుడు ఇలాంటి నేరాలను తీవ్రంగా ఖండించాలని కోరుతున్నట్లు చెప్పారు. హిందువులు, సిక్కులను మధ్య ప్రాశ్యత దేశాలకు చెందిన వారిగా పొరపడుతున్నారని తెలిపారు. విద్వేష నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు ఈ సందర్భంగా వినతిపత్రాన్ని అందజేశారు.













