అమెరికాలో భారతీయుడు అరెస్టు
విడాకుల విషయంలో భార్యతో విసిగిపోయిన ఓ భారత సంతతి వ్యక్తి ప్రియురాలితో కలిసి ప్లాన్ వేశాడు. కిరాయి హంతకుడితో చంపించాలనుకున్నారు. కానీ పోలీసులకు దొరికిపోయారు. అమెరికాలోని ఇండియానాకు చెందిన నర్సన్ లింగాల(55) తన భార్య నుంచి విడిపోయి ఉంటున్నాడు. అతనికి సంధ్యారెడ్డి (52) అనే ప్రియురాలు ఉంది. ఈ నేపథ్యంలో మిడిలెసెక్స్ కౌంటీ కోర్టు హౌస్‌లో 2018, జూన్‌లో ఓ కేసు విచారణ సందర్భంగా నా మాజీ భార్యను చంపాలి. నీకు ఎవరైనా కిరాయి హంతకుడు తెలుసా? అని సహచర ఖైదీని నర్సన్ అడిగాడు. నర్సన్తో సరే అని చెప్పినా, తర్వాత ఆ విషయాన్ని ఆ ఖైదీ జైలు ఉన్నతాధికారులకు చేరవేశాడు. దీంతో ఓ అండర్కట్ ఏజెంట్ రంగంలోకి దిగాడు.
గతేడాది ఆగస్ట్‌లో కిరాయి హంతకుడిలా వచ్చిన పోలీస్ అధికారిని న్యూజెర్సీలోని ఓ షాపింగ్ మాల్లో నర్సన్, సంధ్య కలిశారు. నా జీవితం నుంచి ఆమె (మాజీ భార్య) శాశ్వతంగా వెళ్లిపోవాలి. ఇక ఎప్పుడూ తిరిగి రాకూడదు అని నర్సన్ అతడితో చెప్పాడు. ఈ సందర్భంగా భార్య పూర్తి వివరాలను అందించాడు. ఇందుకోసం ఎంత ఖర్చువుతుందని నర్సన్ అడగ్గా దాదాపు 10,000 డాలర్లు ఖర్చువుతుంది. ముందే డౌన్‌పేమెంట్ ఇవ్వాలి అని అధికారి అన్నారు. దీంతో ముందు వెయ్యి డాలర్లు ఇస్తామని నర్సన్ చెప్పాడు. ఈ వ్యవహారం మొత్తాన్ని రహస్య కెమెరాల ద్వారా పోలీసులు రికార్డు చేశారు. డీల్ ముగిసిన వెంటనే పోలీసులు నర్సన్, సంధ్యలను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేరం రుజువయితే వీరిద్దరికీ ఐదేళ్ల జైలుశిక్షతో పాటు 2.50 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశముంది.













