భారతీయ అమెరికన్‌కు మరో కీలక పదవి
అమెరికా ప్రభుత్వంలోని శక్తిమంతమైన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ)కు ముఖ్య సాంకేతిక అధికారి (సీటీవో)గా భారత అమెరికన్ మోనిషా ఘోష్ నియమితులయ్యారు. ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ప్రస్తుతం సీటీవో ఎరిక్ బర్గర్ స్థానంలో వచ్చే నెల 13న ఆమె బాధ్యతలు చేపడతారు. రేడియో, టీవీ, వైర్, ఉపగ్రహం, కేబుల్ ద్వారా సాగే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ కమ్యూనికేషన్లను ఎఫ్‌సీసీ నియంత్రిస్తుంది. ఇది కాంగ్రెస్ పర్యవేక్షణలో నడిచే స్వతంత్ర సంస్థ. అమెరికా కమ్యూనికేషన్లకు సంబంధించిన చట్టాలు, నిబంధనలను అమలు చేసే బాధ్యత ఈ సంస్థదే.
ఎఫ్‌సీసీ చైర్మన్‌గా భారత అమెరికన్ అజిత్ పాయ్ వ్యవహరిస్తున్నారు. సాంకేతిక, ఇంజినీరింగ్ అంశాలపై చైర్మన్‌కు సీటీవో సలహాలిస్తారు. మోనిషా నియామకాన్ని అజిత్ పాయ్ స్వాగతించారు. వైర్లెస్ రంగంపై అనేక ఆధునిక పరిశోధనలకు ఆమె నాయకత్వం వహించారని తెలిపారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెడికల్ టెలిమెట్రీ, ప్రసార ప్రమాణాలు వంటి అంశాల్లో ఆమెకు నైపుణ్యముందని చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్ బీటెక్ చెసిన మోనిషా.. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. షికాగో విశ్వవిద్యాలయంలో ఆమె పరిశోధన అధ్యాపకురాలిగా పనిచేశారు.













